Top
logo

మరి బండికి బ్రేకులేసేందుకు సవాలు సిద్దంగా వుందా.. సంజయ్‌కు ముందున్న అసలుసిలు సవాలేంటి?

మరి బండికి బ్రేకులేసేందుకు సవాలు సిద్దంగా వుందా.. సంజయ్‌కు ముందున్న అసలుసిలు సవాలేంటి?Bandi Sanjay Kumar
Highlights

దీటైన నాయకులు కనిపిస్తారు. కానీ పార్టీ పెరగదు. తగ్గదు. ముందు నుంచీ తెలంగాణలో బీజేపీది ఇలాంటి విచిత్రమైన...

దీటైన నాయకులు కనిపిస్తారు. కానీ పార్టీ పెరగదు. తగ్గదు. ముందు నుంచీ తెలంగాణలో బీజేపీది ఇలాంటి విచిత్రమైన పరిస్థితే. సరిగ్గా ఈ సమయంలో ఎంటర్ అయ్యారు బండి సంజయ్. హిందూత్వ వాదం - దూసుకుపోయే తత్త్వం సంజయ్ లోని ఈ రెండు లక్షణాలు పార్టీకి కలసి వస్తాయా? లేదంటే కొంప ముంచుతాయా? బండి సంజయ్‌కు స్పీడ్‌ బ్రేకర్‌గా మారబోతున్న అసలుసిసలు సవాలేంటి?

తెలంగాణపై ఫోకస్ చేసిన భారతీయ జనతా పార్టీ కొన్నాళ్లుగా ఇక్కడ పార్టీ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ బీజేపీకి కొత్త సారథిగా బండి సంజయ్ ను నియమించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. హేమాహేమీలను కాదని సంజయ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. దీని వెనక బీజేపీ అధిష్టానం లెక్క పక్కాగా వుంది.

ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న సంజయ్ విద్యార్థి దశ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ లాంటి సంస్థల్లో పని చేశారు. ఆ తరువాత పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా ఓడినా, ఎంపీగా గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. టిఆర్‌ఎస్‌లో కీలక నాయకుడు, ఆ పార్టీ అప్పటి లోక్‌సభా పక్ష నేత వినోద్‌ను ఓడించి, అధిష్టానం దృష్టిలో పడ్డారు సంజయ్. ఇక ముందు నుంచీ టిఆర్‌ఎస్‌పై ఎదురు దాడి చేస్తూ పార్టీలో ఇమేజ్ పెంచుకున్నారు. అయితే తెలంగాణ బీజేపీకి కొత్త సారథి నియామకం కోసం పార్టీ అధిష్టానం తీవ్రమైన కసరత్తులు చేసింది. మురళీధర్ రావు, లక్ష్మణ్‌తో పాటు డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి వారిని కాదని సంజయ్ కే పార్టీ అధిష్టానం ఓటేసింది.

అధ్యక్షుడి కోసం జరిపిన అభిప్రాయ సేకరణ లోనూ పలువురు పార్టీలో జోష్ రావాలన్నా, అధికార టీఆర్‌ఎస్ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా యువకులకి, కొత్తవారికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారట. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ సపోర్ట్‌తో పాటు అమిత్ షా, నడ్డాలు సంజయ్ వైపు మొగ్గు చూపారు. నడ్డా తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్‌గా పని చేసిన సమయంలోనూ, ఇక్కడి నాయకుల పని తీరును దగ్గరగా పరిశీలించారట. అలా చివరకు సంజయ్ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట.

మొత్తం మీద సీనియర్లను కాదని సంజయ్‌పై నమ్మకంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, మరి ఆయనకు సీనియర్లు సపోర్ట్ చేస్తారా లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. సంజయ్ తొలిసారి పార్టీ ఆఫీస్‌కి వచ్చిన సందర్భంలో పలువురు సీనియర్ల బాడీ మూమెంట్స్ చూస్తే కొంత అసౌకర్యంగా ఉన్నట్లు అర్థమయ్యింది.

ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు, ఆయన చేసిన మొదటి ప్రసంగంలోనే సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. చాలామంది ఇలాంటి దూకుడే పార్టీకి కావాలని అభిప్రాయపడగా, కొందరు మాత్రం ఇది సరైన విధానం కాదని కామెంట్ చేశారు.

అయితే, 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సంజయ్ ప్రకటించారు. అయితే అది అంత ఈజీ మాత్రం కాదు. ఇక పార్టీ కేవలం పట్టణాలకే పరిమితం కావడం, క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉండటం ఆ పార్టీకి మైనస్. సీనియర్ల సహకారం, కొత్త, పాత నాయకులను సమన్వయం చేసుకుని పోవడం అనేది ఇప్పుడు సంజయ్ ముందున్న అతిపెద్ద సవాల్. మొత్తమ్మీద దూకుడుగా వెళ్తూ అధికార పార్టీపై ఎదురుదాడికి, సంజయ్ సిద్ధమవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగియగానే తెలంగాణవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని సంజయ్ చెప్తున్నారు. అయితే కేవలం దూకుడు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే, రాజాసింగ్ ఎక్కడో ఉండాలి. కేవలం వ్యూహం మాత్రమే పనికి వస్తుందనుకుంటే, ఆ పార్టీకి చాలామంది నిష్ణాతులైన వ్యూహకర్తలున్నారు. విడివిడిగా చూస్తే బీజేపీకి లేనిదంటూ ఏంలేదు. కానీ ఎప్పుడూ ఉపయోగపడిన పాపాన పోలేదు. మరి ఇప్పుడు ఈ సంజయ్ అస్త్రం కమల వికాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని వేచి చూడాలి.Web Titleis bandi sanjay overcome from political challenges raised from telangana bjp senior leaders
Next Story