కొల్లాపూర్‌లో తారస్థాయికి చేరిన టిఆర్ఎస్ వర్గపోరు.. మున్సిపల్‌ బరిలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గీయులు

కొల్లాపూర్‌లో తారస్థాయికి చేరిన టిఆర్ఎస్ వర్గపోరు.. మున్సిపల్‌ బరిలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గీయులు
x
కొల్లాపూర్‌లో తారస్థాయికి చేరిన టిఆర్ఎస్ వర్గపోరు
Highlights

ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లా కొల్లాపూర్ టిఆర్ఎస్ లో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య...

ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లా కొల్లాపూర్ టిఆర్ఎస్ లో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య ఆధిపత్య పోరుతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున జూపల్లి వర్గీయులు బరిలోకి దిగారు. తన మద్దతుదారులకు మద్దతుగా ప్రచారం చేశారు. జూపల్లి వ్యవహారంపై హర్షవర్ధన్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్ లో పై చేయి సాధించేందుకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎత్తులు పై ఎత్తులతో మున్సిపల్ పోరు ఆసక్తికరంగా మారింది.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణా రావుపై కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి గెలుపొందారు. తర్వాత హర్షవర్దన్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం జూపల్లి కృష్ణా రావుకు రుచించలేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గత లోక్ సభ, స్థానిక ఎన్నికల్లోనూ జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగాయి. ఇద్దరు తమ వర్గం అభ్యర్థులను నిలబెట్టి అభాసుపాలయ్యారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ రెండు వర్గాలు ఆధిపత్య పోరుకు ప్రయత్నిస్తున్నాయి.

కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు తన మద్దతుదారులకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి టికెట్లు ఇచ్చారు. తన వర్గానికి మొండిచేయి చూపడంపై జూపల్లి ఆగ్రహించారు. తనవర్గీయులకు ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున 19 వార్డుల్లో పోటీలో నిలబెట్టారు. ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థుల కరపత్రాలు, ఫ్లెక్సీలలో అభ్యర్థుల బొమ్మతో పాటు జూపల్లి ఫోటోలు వున్నాయి. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు మద్దతుగా స్వయంగా జూపల్లి ప్రచారం చేయడం టీఆర్ఎస్ లో కలకలం రేపింది.

జూపల్లి తీరుపై ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జూపల్లిని పిలిపించి కేటీఆర్ నచ్చజెప్పారు. పార్టీ నుంచి సస్పెండ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జూపల్లి తన వర్గీయులను గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొల్లాపూర్ లో పైచేయి సాధించాలని పట్టుదలగా ఉన్నారు. జూపల్లి వ్యవహారం ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డివర్గీయులకు మింగుడుపడడంలేదు. కొల్లాపూర్ లోనే కాదు అలంపూర్ లోని మొత్తం 10 వార్డుల్లో 8 వార్డుల్లో ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ తరపున టీఆర్ఎస్ రెబెల్స్ పోటీ చేస్తున్నారు. జూపల్లి తీరు టీఆర్ఎస్ కు నష్టం కలిగిస్తుందని పార్టీ పెద్దలు ఆవేదన చెందుతున్నారు. అధికార పార్టీలోని అంతర్గత పోరును సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories