Top
logo

హైకోర్టులో గోపాల గోపాల మూవీ సీన్.. ఓ కేసులో దేవుడిని ప్రతివాదిగా చేర్చిన ధర్మాసనం !

హైకోర్టులో గోపాల గోపాల మూవీ సీన్.. ఓ కేసులో దేవుడిని ప్రతివాదిగా చేర్చిన ధర్మాసనం !
Highlights

ఊహకు మాత్రమే అందే కొన్ని విషయాలు కథల రూపంలోనో సినిమాల్లోనో కనిపిస్తాయి. అవి చెప్పుకునేందుకే బాగానే ఉంటాయి...

ఊహకు మాత్రమే అందే కొన్ని విషయాలు కథల రూపంలోనో సినిమాల్లోనో కనిపిస్తాయి. అవి చెప్పుకునేందుకే బాగానే ఉంటాయి కానీ, నిజజీవితంలో అలా జరుగుతుందనే ఆలోచన రాదు. అలాంటి కొన్ని అంశాలు అప్పుడప్పుడూ నిజరూపం దాల్చుతుంటాయి. అందులో ఒకటి న్యాయస్థానాల్లో దేవుడిని ప్రతివాదిగా చేసుకోవడం. అప్పట్లో పవన్ కల్యాణ్, వెంకటేశ్ కాంబినేషన్‌లో వచ్చిన హిట్ మూవీ గోపాల గోపాల గుర్తుందా..? అచ్చం అలాంటి కథను గుర్తుచేసే ఓ రియాల్టీ స్టోరీ మన హైదరాబాద్‌ శివారులో జరిగింది. ఓ కేసులో ఏకంగా దేవుడినే ప్రతివాదిగా చేర్చుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

షాపులో అగ్నిప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లైమ్ చేసే క్రమంలో గాడ్ యాక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చి, న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగిన గోపాల గోపాల సినిమాలో లాగానే హైదరాబాద్‌ శివారు అమీన్‌పూర్‌లోని ఓ ఆలయం వ్యవహారం కూడా హైకోర్టు మెట్లెక్కింది. పార్క్‌ను కబ్జా చేసి దేవాలయం నిర్మిస్తున్నారంటూ హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సంస్థ న్యాయస్థానంలో కేసు వేయడంతో చట్టానికి దేవుడు కూడా అతీతులు కారని, ఈ కేసులో దేవుడిని కూడా ప్రతివాదిగా చేర్చాలంటూ న్యాయస్థానం ఆదేశించడంతో భక్తులు నిర్ఘాంతపోయారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పుర్‌ మాధవపురి హిల్స్‌లోని రాక్ గార్డెన్‌లో అక్రమంగా దేవాలయం నిర్మించారంటూ హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన సంస్థ హైకోర్ట్‌లో పిల్ దాఖలు చేసింది. దీనిపైన విచారణ చేపట్టిన ధర్మాసనం ఎదుట ఇరుపక్షాలు వాదనలు వినిపించారు. పార్క్ కోసం స్థలం కేటాయిస్తే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక కమిటీ వేసి చందాలు వసూలు చేసి నిబందనలకు విరుద్దంగా దేవాలయం నిర్మాణం చేశారని, వెంటనే ఆ దేవాలయాన్ని కుల్చివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్ట్‌ను కోరారు. ఈ సందర్భంగా 2017 లో ఫిర్యాదు అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ అమీన్‌పుర ఈవోపై న్యాయస్థానం ప్రశ్నించింది.

అయితే అమీన్‌పూర్‌ ప్రాంతంలో దాదాపు ఏడూ పార్క్ లు ఉన్నాయని అందులో ఒక్కటి కూడా అభివృద్ధి జరగలేదని ఆలయకమిటి తరపు న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. 2014 లో కమిటి ఏర్పాటు చేసి అందరి అభిప్రాయలు తీసుకన్న తరువాతే దేవాలయ నిర్మాణం ప్రారంబించడం జరిగిందని వివరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆలయాలపై కోర్టులో పిటిషన్‌లు వేశారంటూ వాదనల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఓ మంచిపని కోసమే దేవాలయం నిర్మాణం చేశామని ఇందులో ఎవరి వ్యక్తిగత స్వార్థం లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడు లేదా దేవాలయం రాజ్యాంగానికి, చట్టానికి అతీతం కాదని చట్టానికి లోబడి ఉండాలని తెలిపింది. ఈ కేసులో ఆలయ కమిటీతో పాటు దేవుడిని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది.

అయితే ఈ వ్యవహారంపై హిందూ ధార్మిక సంస్థలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవాలయాన్ని కూల్చేస్తామంటే ఊరుకోమని తేల్చిచెబుతున్నారు. ఎలాంటి కష్టం వచ్చినా దేవుడున్నాడనే నమ్మకం భక్తుల్లో ఉంటుంది. కానీ అలాంటి దేవుడి ఆలయానికే ఆపద వస్తే..? కోర్కెలు తీర్చే కోనేటిరాయుడికే కష్టం వస్తే..? ఇప్పుడీ ప్రశ్నలు సమాధానాల కోసం వేచిచూస్తున్నాయి.

Web TitleGopala Gopala movie scene became real in the Telangana high court
Next Story

లైవ్ టీవి


Share it