హైదరాబాద్‌‌లో 12 కంటైన్‌మెంట్ క్లస్టర్లు.. అష్టదిగ్బంధం!

హైదరాబాద్‌‌లో 12 కంటైన్‌మెంట్ క్లస్టర్లు.. అష్టదిగ్బంధం!
x
Highlights

కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని తన గుప్పిట బంధించింది. ఈ వైరస్‌తో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. వైరస్‌ బారినపడిన దేశాలకు దేశాలు వణికిపోతున్నాయి....

కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని తన గుప్పిట బంధించింది. ఈ వైరస్‌తో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. వైరస్‌ బారినపడిన దేశాలకు దేశాలు వణికిపోతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించి చర్యలను ముమ్మరం చేశారు.

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువున్న 12 ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని యంత్రాంగానికి స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌తో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్‌ తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోనూ 3 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించారు.

నగరంలో 175 కరోనా కేసులు ఉండగా 12 ప్రాంతాల్లోనే 89 మంది వైరస్‌ బారినపడ్డారు. దీన్ని ఇలాగే వదిలేస్తే పరిస్థితి మరింత చేజారుతుందని ఆ ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. అయితే కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా ప్రకటించిన ప్రాంతాలలో ప్రతి ఇంటిని వైద్యఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ, సంబంధిత విభాగాలు తనిఖీ చేస్తాయి. సర్వే చేసి, వ్యాధి లక్షణాలున్న వారిని ఆస్పత్రికి తరలిస్తారు. వైరస్‌ సోకితే ఐసోలేషన్‌ లేదా నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడున్న ప్రతి వీధిని శుభ్రం చేసి, క్రమం తప్పక క్రిమి సంహారకాలు పిచికారీ చేస్తారు. నిత్యం పర్యవేక్షిస్తారు. ఆ ప్రాంతాల్లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

ఢిల్లీకి వెళ్లొచ్చినవారు ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 593 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో 83 మందికి వైరస్‌ సోకిందని వారి ద్వారా మరో 51 మందికి వ్యాపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వేర్వేరు మార్గాల్లో మరో 70మందికి కరోనా సోకింది. వీరందరి నివాస ప్రాంతాలను అధికారులు ప్రభుత్వ యాప్‌లో జియోట్యాగ్‌ చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో బుధవారం నాటికి 659 మంది నివాసాలను జియోట్యాగ్‌ చేశారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్ ప్రాంతాలుగా రాంగోపాల్‌పేట, షేక్‌పేట, రెడ్‌ హిల్స్‌, మలక్‌పేట, సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, అల్వాల్‌, మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, మయూరినగర్‌, యూసుఫ్‌గూడ, చందానగర్‌, బాలాపూర్‌, చేగూరు, తుర్కపల్లిలు ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories