నేడు సచివాలయం, అసెంబ్లీకి శంకుస్థాపన

నేడు సచివాలయం, అసెంబ్లీకి శంకుస్థాపన
x
Highlights

తెలంగాణ నూతన సచివాలయం, కొత్త అసెంబ్లీ నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పుడున్న ప్రాంగణంలోనే సెక్రటేరియట్‌...

తెలంగాణ నూతన సచివాలయం, కొత్త అసెంబ్లీ నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పుడున్న ప్రాంగణంలోనే సెక్రటేరియట్‌ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఇక ఎర్రమంజిల్‌ నిజాం ప్యాలెస్‌ ప్రాంతంలో అసెంబ్లీ భవన సముదాయానికి కేసీఆర్ ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరో నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఆధునాతన సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పుడున్న ప్రాంగణంలోనే నూతన సెక్రటేరియట్‌ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఉదయం 10గంటలకు సచివాలయ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఆ తర్వాత 11గంటలకు ఎర్రమంజిల్‌‌లో కొత్త అసెంబ్లీ భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు.

ప్రస్తుతమున్న సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించనున్నారు. సుమారు ఆరు లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అత్యాధునిక హంగులు... పక్కా వాస్తుతో నూతన సచివాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమీక్షా సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మాణం జరుగనున్నది. ఇందుకోసం సమావేశ హాళ్లు, కలెక్టర్ల సమావేశం కోసం కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్మించనున్నారు. అలాగే విశాలమైన పార్కింగ్ ఏర్పాటుకూడా చేయనున్నారు. పూర్తి పర్యావరణ హితంగా సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఎర్రమంజిల్‌‌లోని నిజాం ప్యాలెస్‌ ప్రాంతంలో నూతన అసెంబ్లీ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతమున్న అసెంబ్లీ డిజైన్‌లోనే కొత్త భవన నిర్మాణం కూడా చేపట్టనున్నారు. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణమున్న ఎర్రమంజిల్‌ ప్రాంగణంలో నూతన అసెంబ్లీ, మండలి, ఇతర భవనాలను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్నారు. సచివాలయాన్ని సుమారు 5వందల కోట్లు, అసెంబ్లీని దాదాపు వంద కోట్ల రూపాయలతో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే సెక్రటేరియట్‌, అసెంబ్లీ నిర్మాణాల కోసం నియమించిన కేబినెట్‌ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories