హైదరాబాద్‌లో ఫారిన్ పోస్టాఫీస్

హైదరాబాద్‌లో ఫారిన్ పోస్టాఫీస్
x
Highlights

ఒకప్పుడు విదేశాలకు విలువైన వస్తువులు, పార్శిల్స్ పంపాలంటే పెద్ద ప్రక్రియ. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ ఎగ్జామినేషన్స్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి...

ఒకప్పుడు విదేశాలకు విలువైన వస్తువులు, పార్శిల్స్ పంపాలంటే పెద్ద ప్రక్రియ. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ ఎగ్జామినేషన్స్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడా సమస్య తొలగిపోయింది. స్థానికంగా ఉన్న డిమాండ్‌ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో అంతర్జాతీయ పోస్టల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. తయారీరంగంలో దూసుకుపోతూ ఎన్నో ఉత్పత్తులకు హబ్‌గా మారిన హైదరాబాద్‌లో ఫారిన్ పోస్టాఫీస్ అందుబాటులోకి వచ్చింది. గతంలో చిన్న, మధ్యతరహా వ్యాపారులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడంతోపాటు ముడి సరుకు దిగుమతి చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడీ ఫారిన్ పోస్టాఫీస్ ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులన్నీ తొలగిపోయాయి.

సాధారణంగా విదేశాలకు ఏవైనా పార్శిల్స్ పంపాలంటే ఆయా వస్తువులకు సంబంధించిన తనిఖీలతోపాటు కస్టమ్స్ క్లియరెన్స్ కూడా తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగం ఈ పనులను పర్యవేక్షిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫారిన్ పోస్టాఫీసు సేవల ద్వారా వ్యాపారులకు ఎగుమతులు, దిగుమతులు సులువయ్యాయి.

అయితే, ఈ పోస్టల్ రవాణా దేశంలో ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లోనే ఇప్పటిదాకా అందుబాటులో ఉంది. తాజాగా హైదరాబాద్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. పోస్టల్ శాఖ కస్టమ్స్‌ శాఖతో కలిసి ఏర్పాటు చేసిన ఈ ఫారిన్ పోస్టాఫీస్ హైదరాబాద్‌లోని హ్యుమాయూన్ నగర్ పోస్టాఫీసులో ఏర్పాటైంది. దీంతో పారిశ్రామిక ఉత్పత్తులకు ఇక్కడి నుంచే తనిఖీలతోపాటు విదేశాలకు పంపించేందుకు అన్ని అనుమతులు లభించనున్నాయి.

హైదరాబాద్ నుంచి ఎక్కువగా అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు పార్శిల్స్ వెళ్తుంటాయి. ప్రస్తుతం ఇవన్నీ ముంబయి నుంచి కొంత ఎక్కువ సమయం తీసుకుని కస్టమ్స్ క్లియరెన్స్ అయిన తర్వాతే వెళ్తాయి. ఈ సమస్యను గుర్తించిన పోస్టల్ శాఖ.. సెంట్రల్ ఎక్సైజ్ శాఖతో కలిసి ఎట్టకేలకు హైదరాబాద్‌లో ఫారిన్ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి పార్శిల్‌ను తనిఖీ అనంతరం ఎగుమతి, దిగుమతికి అనుమతిస్తారు. ఎలాంటి ఇబ్బందుల్లేవని స్పష్టత వచ్చాకే కస్టమ్స్ అధికారులు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఏది ఏమైనా ఈ ఫారిన్ పోస్టాఫీస్ ఏర్పాటుతో వ్యాపారుల సమస్యలు తొలగిపోయి, విదేశీ సంబంధిత సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories