కొంపముంచిన పానిపూరి : 40 మంది అస్వస్థత

కొంపముంచిన పానిపూరి : 40 మంది అస్వస్థత
x
Highlights

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పానిపూరిని ఇష్టపడని వారు ఉండరు.

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పానిపూరిని ఇష్టపడని వారు ఉండరు. సాయంత్రమైతే చాలు రోడ్డు పక్కన ఉన్న పానీపూరీ బండి దగ్గర గప్‌చుప్‌లు లాగించేయడానికి పిల్లలు కాచుకుని ఉంటారు. అలాంటిది లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ఈ పానిపూరిని చాలా మిస్ అయ్యారు. ఒక్క సారిగా లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో పానిపూరి వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కాలనీలలో తిరిగి పానీపూరీని అమ్మడం ప్రారంభించారు. అలా విక్రయిస్తున్న పానిపూరిని తిన్న 40 మందికి అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తివివరాల్లోకెళితే ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షిద్‌నగర్‌, సుందరయ్య నగర్‌కు చెందిన చిన్నారులు సోమవారం సాయంత్రం ఓ తోపుడుబండి వద్ద పానీపూరి తిన్నారు. రంజాన్‌ సందర్భంగా కాలనీకి గప్‌చుప్‌ బండి రావడంతో చిన్నాపెద్దా కలిసి పానీపూరిని టేస్ట్ చేసారు. పానీ పూరిని తిన్న వారందరూ కొద్ది సేపటివరకూ బాగానే ఉన్నారు. సరిగ్గా రాత్రి 9 గంటలు అవుతున్న సమయంలో ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు చేసుకోవడం ప్రారంభించారు. అలా కొద్దిసేపటికే పానిపూరి తిన్న వారందరూ వాంతులు విరోచనాలు చేసుకుని అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వారిని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అలా అస్వస్థతకు గురైన వారిలో పెద్ద వారితో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు.

అసలు ఇంత మంది ఒక్కసారిగా ఇలా కావడానికి గల కారణాలేంటని ఆరా తీయగా వారంతా పానీపురీ తిన్న విషయం బయట పడింది. ప్రస్తుతం వారందరూ కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని రిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు రిమ్స్‌కు చేరుకుని వారిని పరామర్శించారు. నిజానికి లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం పానీపురీ అమ్మకాలకు వెసులుబాటు లేకపోయినప్పటికీ కొంత మంది ఉపాధి కోసం కాలనీలలో పానీపురీని విక్రయిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories