ఎల్‌బీనగర్‌ షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం:చిన్నారి మృతి

ఎల్‌బీనగర్‌ షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం:చిన్నారి మృతి
x
Highlights

♦ చిన్నారుల ఐసీయూ వార్డులో మంటలు ♦ పొగకు ఊపిరాడక ఏడుగురు చిన్నారులకు తీవ్ర అస్వస్థత ♦ ఓ చిన్నారి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ♦ ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో 42 మంది చిన్నారులు

ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రులు నిర్లక్ష్యంతో అవే ప్రాణాలను తీస్తున్నాయి. రోగం నయం అవుతుందనుకుని ఆస్పత్రికి వస్తే ఆ వ్యాధి మాట అటుంచితే అసలులే ఎసరు పెడుతున్నారు. హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. చిన్న పిల్లల వార్డు అందునా ఐసీయూ అంటే ఎంత అలర్ట్‌గా ఉండాలి..? కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి బలైంది. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో నలుగురు చిన్నారులు వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎల్‌బీనగర్‌లోని షైన్ ఆస్పత్రిలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 3 వ అంతస్థులోని చిన్నారుల ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించడంతో మొత్తం ఏడుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో చికిత్స పొందుతున్న 5 నెలల చిన్నారి ఊపిరాడక అక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగతా ఆరుగురిలో ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా మారింది. వీరిని వేరే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో మొత్తం 42 మంది చిన్నారులున్నారు.

ఈ ఘటనలో ఐసీయూ విభాగం పూర్తిగా కాలిపోయింది. మంటలను అదుపుచేసేందుకు ఆస్పత్రి సిబ్బంది ఐసీయూ అద్దాలను పగులగొట్టారు. అందులో ఉన్న చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. ఇటు సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రిని క్లోజ్ చేశారు. అందులోని రోగుల్ని ఇతర ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన తమ చిన్నారి అప్పగించాలంటూ సూర్యాపేటకు చెందిన ఆ పాప తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రి దగ్గర విషాదకరమైన వాతావరణం నెలకొంది.

రంగంలోకి దిగిన పోలీసులు

రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. ఫ్రిడ్జ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఐసీయూలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు.. అలర్ట్‌ అలారం ఎందుకు మోగలేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఐసీయూ ఇబ్బడి ముబ్బడిగా ఉన్న వైర్ల, కేబుల్స్‌పై ఆరా తీశారు. అవి ఇక్కడెందుకున్నాయని ప్రశ్నించారు. గతంలో కూడా ఇదే ఆస్పత్రిలో స్వల్ప ప్రమాదం జరిగిందని, అప్పుడు యాజమాన్యం పట్టించుకోలేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories