Top
logo

సొంతగూటికి వలస కార్మికుల పయనం...46 రైళ్లలో 50వేల మంది

సొంతగూటికి వలస కార్మికుల పయనం...46 రైళ్లలో 50వేల మంది
Highlights

కరోనా మహమ్మారి విజృంభణతో ఎంతో మంది వలస కూలీలు ఉపాధి కోల్పోయి, తిండికి, నివాసానికి ఇబ్బందులు ఎదురవడంతో సొంతగూటికి బయల్దేరారు.

కరోనా మహమ్మారి విజృంభణతో ఎంతో మంది వలస కూలీలు ఉపాధి కోల్పోయి, తిండికి, నివాసానికి ఇబ్బందులు ఎదురవడంతో సొంతగూటికి బయల్దేరారు.కాగా వారందరినీ జాగ్రత్తగా వారి వారి ఇండ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. స్వయంగా ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరించి రైళ్ల ద్వారా సురక్షితంగా ఇండ్లకుచేర్చే బాధ్యతను చేపట్టింది. ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో 46 శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటుచేసి సుమారుగా 50వేల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చింది. కాగా ఆయా శ్రామిక్ రైళ్లను శనివారం రోజున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి 6 రైళ్లు, వివిధ రైళ్వేస్టేషన్ల నుంచి మరో 40 రైళ్లు రాష్ట్రాలకు బయలుదేరాయని చెప్పారు. వేరే వేరే ప్రాంతాల నుంచి నడిపిస్తున్న ఈ రైళ్ల ద్వారా దాదాపు 50 వేలమంది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ నుంచి 128 రైళ్ల ద్వారా 1.70 లక్షల మంది వలస కార్మికులను తమ స్వగ్రామాలకు చేరుకున్నారని తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్‌ నుంచి మూడు శ్రామిక్‌ రైళ్లు ఒడిశాకు బయల్దేరాయని తెలిపారు. ఈ రైళ్లలో 5,304 మంది వలస కార్మికులు వెళ్లారన్నారు.

ఇక పోతే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కొక్కరికి రెండు ఆహార పొట్లాలు, మూడు లీటర్ల తాగునీరు, పండ్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే తమ గ్రామాలకు వెల్లాలని రిజిస్టర్ చేసుకున్నారో ఆ కార్మికులను పూర్తిగా సొంత రాష్ట్రాలకు పంపే ప్రక్రియ పూర్తయిందన్నారు. అయితే వెళ్తున్నవారిలో చాలామంది తెలంగాణకు తిరిగి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు.

అదేవిధంగా మహబూబ్‌నగర్‌ నుంచి కూడా ప్రభుత్వం మరికొన్ని రైళ్లను ఒడిశాకు వేసాయి. కాగా ఆ రైళ్లలో 1750 మంది నవపహాడ్‌కు వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించారని, ఇందులో పోలీసులు సమర్థంగా పనిచేశారని చెప్పారు. ఆపదలో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చడం సంతోషంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వలస కార్మికులు ఒక భాగం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌, డీజీపీలతో పాటు పోలీసు శాఖ అదనపు డీజీ జితేందర్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఆర్థికశాఖ కార్యదిర్శి రొనాల్డ్‌ రోస్‌, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరీశ్‌ పాల్గొన్నారు.

Web TitleFifty thousand migrant workers journey with 46 trains in Telangana
Next Story