logo

తెలంగాణ బడ్జెట్‌పై ఆర్థికమాంద్యం ఎఫెక్ట్‌.. కీలక రంగాల్లో భారీ కోత తప్పదనే సంకేతాలు..?

తెలంగాణ బడ్జెట్‌పై ఆర్థికమాంద్యం ఎఫెక్ట్‌.. కీలక రంగాల్లో భారీ కోత తప్పదనే సంకేతాలు..?
Highlights

తెలంగాణ బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది..? బడ్జెట్‌ పూర్తి వాస్తవికంగా ఉంటుందని ముందే చెప్పడంతో కోతలకు రంగం...

తెలంగాణ బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది..? బడ్జెట్‌ పూర్తి వాస్తవికంగా ఉంటుందని ముందే చెప్పడంతో కోతలకు రంగం సిద్ధమైనట్లేనా..? సాగునీటి రంగానికి భారీ కోత తప్పదా..? సంక్షేమ పథకాలకు కేటాయింపుల మాటేంటి..? ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌తో పోలిస్తే తక్కువగా ఉంటుందా..? సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రత్యేక కథనం.

సోమవారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు 2019 - 2020 వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెడతారు. బడ్జెట్‌ సమావేశాలు 8 లేదా 9 రోజులు సాగుతాయని తెలుస్తోంది. అయితే బడ్జెట్‌ సమావేశాల పనిదినాలు మాత్రం బీఏసీలో నిర్ణయిస్తారు. శాసనమండలిలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

అయితే ఈ సారి బడ్జెట్‌ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై పడిందని విశ్లేషిస్తున్నారు. కీలక రంగాల్లో భారీగా కోత తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ ఉంటుందని ముందే ప్రకటించడంతో పలు కీలక రంగాలకు కోత తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా సాగునీటి రంగానికి భారీ కోత ఉంటుందని తెలుస్తోంది. గత ఐదేళ్లుగా ఈ రంగానికి ఏటా 25 వేల కోట్లు కేటాయిస్తూ వస్తుండగా ఈ సారి అందులో మూడో వంతు కూడా ఉండదని చెబుతున్నారు. అలాగే సంక్షేమ పథకాలకు కూడా కోత ఉంటుందని తెలుస్తున్నా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయి.

లక్షా 81 వేల కోట్లతో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోలిస్తే వార్షిక బడ్జెట్‌ అంచనాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్‌లో భేటీ అయిన మంత్రివర్గం వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అలాగే సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు కూడా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై కేసీఆర్‌ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.


లైవ్ టీవి


Share it
Top