Disha Case: ఆ 8 గంటలు!

Disha  Case: ఆ 8 గంటలు!
x
ఎన్‌హెచ్‌ఆర్సీ
Highlights

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దిశ నిందితులపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కాల్పుల్లో పాల్గొన్న పోలీసులను కమిషన్‌ సభ్యులు మంగళవారం 8...

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దిశ నిందితులపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కాల్పుల్లో పాల్గొన్న పోలీసులను కమిషన్‌ సభ్యులు మంగళవారం 8 గంటలపాటు విచారించారు. వీరి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. దీంతో ఈ విచారణ ముగిసినట్లు, ఇవాళ ఎన్‌హెచ్‌ఆర్సీ టీమ్‌ తిరిగి ఢిల్లీ వెళ‌్లనున్నట్లు తెలుస్తోంది.

నాలుగు రోజులపాటు దిశ అత్యాచారం, హత్యపై విచారణ చేపట్టింది ఎన్‌హెచ్‌ఆర్సీ. బాధితులు, సాక్షులు, ప్రభుత్వ అధికారులను విచారించడంతో పాటు ఘటనాస్థలాన్ని పరిశీలించింది. నిందితుల దాడిలో గాయపడ్డ ఎస్సై, కానిస్టేబుల్‌లను విచారించారు. మిగిలిన 8 మంది పోలీసులను తెలంగాణ పోలీసు అకాడమీకి పిలిపించి ఉదయం 11 గంటల నుంచి దాదాపు రాత్రి 8 గంటల వరకూ విచారించారు.

నిందితులపై కాల్పులు జరిగినప్పుడు విధుల్లో ఉన్న పోలీసులపై సంఘటనకు సంబంధించి ప్రశ్నల పరంపర కొనసాగించినట్లు తెలుస్తోంది. జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న తర్వాత కాల్పుల్లో చనిపోయే వరకూ మధ్యలో ఉన్న రెండురోజుల్లో వారిని ఎక్కడ ఉంచారు, ఏం ప్రశ్నలు అడిగారు, వారు ఏం చెప్పారన్న విషయాలతో పాటు సంఘటనస్థలానికి ఏ సమయంలో తీసుకెళ్లారు, అప్పుడు ఏం జరిగిందన్న వివరాలను ఆరా తీశారు. కాల్పులు జరిగిన తర్వాత సమాచారం ఎవరికి ఏసమయానికి చెప్పారన్నదానిపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిందితులపై ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు, లొంగిపొమ్మని హెచ్చరించారా? తర్వాత పరిణామాలను అడిగినట్లు సమాచారం.

విచారణ జరుపుతున్న కమిషన్‌ సభ్యులకు దిశ కేసుకు సంబంధించిన ఆధారాలను సైబరాబాద్‌ పోలీసులు సమర్పించారు. తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల లారీ, బాధితురాలి బైక్‌కు సంబంధించిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. దిశను తగలబెట్టడానికి పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్న నిందితులు, ఆమెను లారీలో తరలిస్తున్న దృశ్యాల వంటి వాటిని అందజేశారు. దిశను హత్య చేసిన ప్రాంతంతో పాటు ఆమెను దహనం చేసిన ప్రదేశంలో సేకరించిన ఆధారాలకు సంబంధించిన నివేదికను కూడా సమర్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories