ఒక అనుమానం ప్రాణాల మీదికి తెచ్చింది

ఒక అనుమానం ప్రాణాల మీదికి తెచ్చింది
x
Highlights

ఒక అనుమానం పెనుభూతమైంది. ఒక అనుమానం ప్రాణాల మీదికి తెచ్చింది. ఒక అనుమానం పశ్చాత్తాపడేలా చేసింది. ఒక అనుమానం తప్పు ఎవరిదో తప్పెలా జరిగిందో తెలిసొచ్చేలా...

ఒక అనుమానం పెనుభూతమైంది. ఒక అనుమానం ప్రాణాల మీదికి తెచ్చింది. ఒక అనుమానం పశ్చాత్తాపడేలా చేసింది. ఒక అనుమానం తప్పు ఎవరిదో తప్పెలా జరిగిందో తెలిసొచ్చేలా చేసింది. అవును నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం చూస్తే జరిగిన సంగతి తెలిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఒక బాధితుడికి జరిపిన రక్తపరీక్షలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఇంతకీ ల్యాబ్‌ రిపోర్ట్‌లో తేలిందేమిటి బాధితుడి బంధువుల అయోమయానికి, అనుమానికి కారణాలేంటి? హెచ్ఎంటీవీ పరిశోధనలో తేలిన నిజాలేంటి?

రక్త పరీక్షల ల్యాబ్స్ ఇస్తున్న రిపోర్టులు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒక ల్యాబ్‌లో జరిగిన పొరపాటును సెకండ్‌ ఒపినీయన్‌ తీసుకోకుండా కన్ఫామ్‌ చేసుకోవడమే అయోమయానికి దారితీసింది. సరిగ్గా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ప్లేట్ లెట్స్ రిపోర్టుల గందరగోళం ఓ రోగి ప్రాణం మీదకు తెచ్చేలా చేసింది.

ఇతని పేరు రాజ్‌కుమార్‌. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలవాసి. తీవ్ర జ్వరంతో చికిత్స నిమిత్తం ప్రగతి ఆసుపత్రిలో ఆరు రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. అయితే జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో ఆసుపత్రిలోని గంగా ల్యాబ్‌లో డెంగ్యూ నిర్దారణ పరీక్షలు చేయించారు. తొలి రోజు 42 వేల ప్లేట్ లెట్స్ కౌంట్ రాగా రెండో రోజు మరోసారి పరీక్ష చేయించారు. అప్పుడు 20వేలకు ప్లేట్ లెట్స్ కౌంట్ వచ్చింది. ఆందోళనకు గురైన రాజ్ కుమార్ బంధువులు అక్కడి ఓ ప్రైవేటు ల్యాబ్‌లో తిరిగి డెంగ్యూ నిర్దారణ పరీక్షలు చేయించారు. అక్కడ లక్షా 58 వేల ప్లేట్ లెట్ కౌంట్ రావడంతో షాక్‌కు గురయ్యారు. గంగా ల్యాబ్‌ కాకుండా ప్రైవేటు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును నమ్మిన రాజ్‌కుమార్ బంధువులు తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చారంటూ గంగా ల్యాబ్‌ ముందు ఆందోళన చేశారు. అనంతరం ప్రగతి హాస్పిటల్ నుంచి డిశార్జ్ అయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలైంది.

ప్రగతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రాజ్‌కుమార్‌కు జ్వరం మరింత ముదిరిది. హుటాహుటిన మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డెంగ్యూ నిర్దారణ పరీక్షలు చేయించగా గంగా ల్యాబ్ రిపోర్టుకు సమానంగా ప్లేట్ లెట్ కౌంట్ వచ్చింది. ఖంగుతిన్న బాధితులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడా గంగా ల్యాబ్ ఇచ్చిన 20వేల రిపోర్టుకు సమానమైన ప్లేట్ లెట్ కౌంట్ వచ్చింది. గంగా కాకుండా ఆ ప్రైవేటు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును నమ్మి రోగి ప్రాణాల మీదికి వచ్చిందని బాధితులు ఇప్పుడు గగ్గోలుపెడుతున్నారు.

ప్రైవేటు ల్యాబ్‌ కాకుండా మొదటిసారి పరీక్షలు చేయించిన గంగా ల్యాబ్‌లోనే సరైన రిపోర్టు వచ్చిందంటున్నారిప్పుడు రాజ్‌కుమార్ బంధువులు. తొందరపడి గంగా ల్యాబ్‌ ముందు ఆందోళనకు దిగామని ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు. అక్కడ గంగా ల్యాబ్‌లో చిన్న తప్పు కూడా జరగలేదని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రైవేటు ల్యాబ్ రిపోర్టును నమ్మి మోసపోయామని గుర్తించామంటున్న రాజ్‌కుమార్‌ బంధువులు ఆ ల్యాబ్‌ ముందు ఆందోళనకు సిద్దమవుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories