జగిత్యాల జిల్లాలో విస్తరిస్తోన్న కరోనా.. 15 రోజుల్లో 54 పాజిటివ్‌ కేసులు నమోదు

జగిత్యాల జిల్లాలో విస్తరిస్తోన్న కరోనా.. 15 రోజుల్లో 54 పాజిటివ్‌ కేసులు నమోదు
x
Representational Image
Highlights

జగిత్యాల జిల్లాలో కరోనా విస్తరిస్తోన్న తీరు కలవరపెడుతోంది. వరుసబెట్టి వస్తున్న కేసులతో ఆ జిల్లా వంద కేసుల వైపు పరుగెడుతోందంటూ ఆందోళన మొదలైంది. కొత్తగా...

జగిత్యాల జిల్లాలో కరోనా విస్తరిస్తోన్న తీరు కలవరపెడుతోంది. వరుసబెట్టి వస్తున్న కేసులతో ఆ జిల్లా వంద కేసుల వైపు పరుగెడుతోందంటూ ఆందోళన మొదలైంది. కొత్తగా నమోదవుతోన్న కేసులన్నీ వలస కూలీలవే కావటం.. రోజూ మహారాష్ట్ర నుంచి వందల కొద్దీ జనం జిల్లాకు వస్తుండటం భయాందోళనలు రేకెత్తిస్తోంది.

ముంబై నుంచి వలస కార్మికుల రాకతో జగిత్యాల జిల్లాలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 15 రోజుల్లో 50కి పైగా కేసులు నమోదవుతుండటంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. ఈ కేసుల సంఖ్య వందకు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. జిల్లాలో నమోదైన కేసుల్లో 99 శాతం కేసులు ముంబై నుంచి వచ్చిన వలస కూలీలవే ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. ఇప్పటివరకు జిల్లాలోని 25 గ్రామాల్లో కరోనా కేసులు వచ్చినట్లు తెలిపారు.

జగిత్యాల జిల్లా నుంచి ముంబైకి వెళ్లిన వారు 45 వేల మంది దాకా ఉండటం.. వాళ్లంతా సొంతూళ్లకి వస్తుండటం జిల్లా వాసులను ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్ర లో అత్యధికంగా కేసులు రావడం..అందులో ముంబైలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అక్కడ ఇన్ని రోజులు పనులు చేసిన వాళ్ళకి కరోనా సోకింది. అయితే వీరందరిలో స్వస్థలాలకి వచ్చాక లక్షణాలు కనపడుతున్నాయి. వీరితో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా వైరస్‌ సోకుతుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు.

మహారాష్ట్ర నుండి రోజుకి దాదాపు 200 వాహనాలు జిల్లాకి వస్తున్నాయి. ఇలా జిల్లాకు వస్తున్న వాహనాలను చెక్ పోస్ట్ ల దగ్గర ఆపి పరీక్షలు జరుపుతున్నా..అడ్డదారుల్లో వస్తున్న వారితో కరోనా సోకే ప్రమాదం ఉంది. వీరంతా అధికారులకు తెలియకుండా ఊళ్లకు చేరుతుండటంతో వారిపై నిఘా పెట్టాలంటున్నారు జగిత్యాల వాసులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories