ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ లో సైలెన్స్!

ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ లో సైలెన్స్!
x
Highlights

కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం పరిశ్రమలను కోలుకోలేని దెబ్బతీసింది. పనులు సాగక చిన్న మధ్య తరహా పరిశ్రమలు భారీగా నష్టపోయాయి. ఇన్నాళ్లూ లాక్‌డౌన్‌తో నష్టాల...

కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం పరిశ్రమలను కోలుకోలేని దెబ్బతీసింది. పనులు సాగక చిన్న మధ్య తరహా పరిశ్రమలు భారీగా నష్టపోయాయి. ఇన్నాళ్లూ లాక్‌డౌన్‌తో నష్టాల పాలైన ఇండస్ట్రీలకు సడలింపులిచ్చాక కార్మికుల కొరత ఆందోళనకు గురిచేస్తోంది. ఇలా ఆర్డర్లు ఉన్నా పనులు చేసేవారు లేక ఖమ్మం గ్రానైట్‌ పరిశ్రమల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

ఖమ్మం జిల్లాలో మొత్తం 450 స్లాబ్‌, 150 వరకు టైల్స్‌, గ్రానైట్‌ పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 20వేల మంది వలస కార్మికులు ఇక్కడ టెక్నికల్‌ పనులు చేస్తున్నారు. ఫినిషింగ్‌, కటింగ్‌, పాలిషింగ్‌, లైనింగ్‌, బ్లాస్టింగ్‌, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ఇలా ప్రతీ పనిలోనూ వలస కార్మికులే పని చేస్తున్నారు. స్థానికంగా ఉన్న మరో 20 వేల మంది అన్‌స్కిల్డ్‌ కార్మికులు కూడా పనిలోకి రావడంలేదు. స్థానిక కార్మికులు అందుబాటులో ఉన్నా వారూ పనులకు ఆసక్తి చూపడం లేదు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రానైట్‌ రంగం సంక్షోభంలో పడింది. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు వెయ్యి కోట్ల టర్నోవర్‌ స్తంభించింది. దీంతో ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 50కోట్లు నష్టపోయారు యజమానులు. దీంతో గడిచిన రెండు నెలలుగా బ్యాంకు రుణాల చెల్లింపులు, కరెంటు బిల్లులు భారంగా మారాయి.

రాయల్టీ మీద ఉన్న 40 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం తొలగించటంతో ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ కోలుకోని పరిస్థితుల్లో ఉంది. ఇదేకాక గత ఐదేళ్ల నుంచి ఖమ్మం గ్రానైట్ పరిశ్రమకు రావాల్సిన వివిధ రకాల రాయితీలను ప్రభుత్వం నిలిపేసింది. దీంతో పరిశ్రమలు బ్యాంకులకు కట్టాల్సిన రుణ వాయిదాలు కట్టలేక NPA లో పడ్డాయి. ఒక వైపు బ్యాంకుల ఒత్తిడి, మరోవైపు ముడిసరుకు కొరత, ఇంకోవైపు ఆర్థిక మాంద్యంతో గ్రానైట్ పరిశ్రమ శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యజమానులు. స్వరాష్ట్రాలకు వెళ్లిన వారు ఇప్పట్లో వస్తారన్న గ్యారంటీ లేకపోగా స్థానిక కార్మికులు కూడా పనులకు రాకపోవటంతో పరిశ్రమల్లో పనులు ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories