సచివాలయం కూల్చివేతను అడ్డుకుంటాం: టీకాంగ్రెస్‌

సచివాలయం కూల్చివేతను అడ్డుకుంటాం: టీకాంగ్రెస్‌
x
Highlights

కొత్త ప్యాలెస్‌‌లు, గడీలు నిర్మించే ఆలోచన మానుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీకాంగ్రెస్‌ లీడర్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రం 2లక్షల కోట్ల...

కొత్త ప్యాలెస్‌‌లు, గడీలు నిర్మించే ఆలోచన మానుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీకాంగ్రెస్‌ లీడర్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రం 2లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అలాంటప్పుడు కొత్త భవనాల నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు. కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయాన్ని పరిశీలించిన టీకాంగ్రెస్‌ నేతలు వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనులు తుగ్లక్‌ చర్యల్లా ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయాన్ని సందర్శించిన టీకాంగ్రెస్‌ లీడర్లు అన్ని బ్లాకులను పరిశీలించారు. సెక్రటేరియట్‌ భవనాలన్నీ పటిష్టంగా ఉన్నాయని, అలాంటప్పుడు కొత్త నిర్మాణాలు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యక్తిగత భవనాలు నిర్మించుకుంటే తమకు అభ్యంతరం లేదని, కానీ ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కొత్త బిల్డింగులు నిర్మిస్తామంటే ఎలా అంటూ నిలదీశారు. అసలు సెక్రటేరియట్‌కే రాని ముఖ్యమంత్రికి ఇక్కడ భవనాల పరిస్థితి ఎలా తెలుస్తుందన్నారు. షాజహాన్ తాజ్‌మహల్‌ కట్టించినట్లు కేసీఆర్ కూడా తన గుర్తింపు కోసం అన్ని భవనాలపై తన పేరుండాలనే దుర్మార్గమైన ఆలోచనతోనే కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని టీకాంగ్‌ నేతలు ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రం 2లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అలాంటప్పుడు కొత్త భవనాల నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు.

ప్రస్తుత సెక్రటేరియట్‌, అసెంబ్లీ బిల్డింగ్స్‌లో వసతుల్లేవని ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారన్న టీకాంగ్రెస్‌ లీడర్స్‌ ఇప్పుడున్న భవనాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సరిపోయే అన్ని సదుపాయాలు, హంగులు ఉన్నాయన్నారు. సచివాలయంలో అన్ని బ్లాకులూ పది నుంచి 30ఏళ్లలోపు కట్టినవేని గుర్తుచేశారు. ఇప్పుడున్న సెక్రటేరియట్‌ను ఆధునిక పరిజ్ఞానంతోనే నిర్మించారని, మూఢ నమ్మకాలతో కూల్చివేయడం సరికాదన్నారు. కేసీఆర్ తన మూఢ నమ్మకాలతో వేలకోట్ల విలువైన భవనాలను కూల్చడమే కాకుండా, కొత్త నిర్మాణాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇదిలాఉంటే, సెక్రటేరియట్‌ భవనాల పరిశీలనకు వచ్చిన టీకాంగ్రెస్‌ లీడర్లను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దాంతో భట్టి, వీహెచ్‌‌లు పోలీసులపై ఫైరయ్యారు. ప్రజాప్రతినిధుల వాహనాలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వాగ్వాదానికి దిగడంతో ఆ తర్వాత లోపలికి అనుమతించారు. ఏదేమైనా సెక్రటేరియట్‌ కూల్చివేతను అడ్డుకుని తీరుతామంటున్న కాంగ్రెస్‌ లీడర్లు కలిసొచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories