సొంతూరుకు సీఎం

సొంతూరుకు సీఎం
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ స్వగ్రామం చింతమడక వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకూ గ్రామంలోనే స్థానికులకు అందుబాటులో ఉండనున్నారు. ఆత్మీయ...

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ స్వగ్రామం చింతమడక వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకూ గ్రామంలోనే స్థానికులకు అందుబాటులో ఉండనున్నారు. ఆత్మీయ సమావేశాలు, సహపంక్తి భోజనాల్లో సీఎం పాల్గొననున్నారు. దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

పురిటిగడ్డపై మమకారంతో తెలంగాణ సీఎం కేసీఆర్ చింతమడకలో పర్యటించనున్నారు. రోజంతా గ్రామస్తులతో మమేకమై ఆత్మీయ సమావేశాలు, సహపంక్తి భోజనాల్లో పాల్గొననున్నారు సీఎం. అలాగే, చింతమడక గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలకు భూమిపూజ చేయడంతోపాటు నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు.

గ్రామస్తులతో మమేకమయ్యేందుకు స్వగ్రామానికి వస్తున్న కేసీఆర్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా సతీసమేతంగా వచ్చారు. ఆ సమయంలో గ్రామానికి వచ్చి అందరితో కలిసి రోజంతా గడుపుతానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామంలో నెలకొన్న సమస్యలపై అధికారులతో సర్వే చేయించి, గ్రామస్తుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై క్షుణ్ణంగా వివరాలు సేకరించారు కేసీఆర్. ఎవరికి ఎంత భూమి ఉంది.. ఏఏ పంటలు సాగు చేస్తున్నారు..? రైతులెందరున్నారు..? వారికి ఎలాంటి అవసరాలున్నాయన్న దానిపై ఓ సమగ్ర నివేదికను తయారు చేశారు. ఈ నివేదిక ఆధారంగా ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లనున్నారు కేసీఆర్.

సీఎం హోదాలో కేసీఆర్ చింతమడకకు వస్తుండటంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. రోడ్లన్నీ శుభ్రంగా తయారయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది. ఊరంతా మొక్కలు నాటారు. అయితే, ప్రత్యేకంగా గ్రామస్తులను కలిసేందుకు కేసీఆర్ వస్తుండటంతో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామంలో సౌకర్యాలు మెరుగుపడున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో చింతమడకలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులకు గుర్తింపు కార్డులు జారీ చేసి, వారితో ఆత్మీయ సమ్మేళనానికి అనుమతి ఇచ్చారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా సభా వేదికతోపాటు సహపంక్తి భోజనాలకు రెయిన్ ప్రూఫ్ టెంట్లను వేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లన్నీ మాజీ మంత్రి హరీశ్‌రావు పదిరోజులుగా దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. సీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే, అధికారులు ఇచ్చిన సమగ్ర సమాచారంతో గ్రామస్తులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్.. గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories