తెలంగాణలో చిన్నారుల కోసం ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు

తెలంగాణలో చిన్నారుల కోసం ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు
x
Highlights

ఎవరికైనా పోలీస్‌స్టేషన్ పేరు చెబితేనే దడ పుడుతుంది. అక్కడికి వెళ్లాలంటే కాళ్లు చేతులు గజగజ వణికిపోతాయి. కానీ ఏ కష్టం వచ్చినా న్యాయం కోసం తప్పకుండా...

ఎవరికైనా పోలీస్‌స్టేషన్ పేరు చెబితేనే దడ పుడుతుంది. అక్కడికి వెళ్లాలంటే కాళ్లు చేతులు గజగజ వణికిపోతాయి. కానీ ఏ కష్టం వచ్చినా న్యాయం కోసం తప్పకుండా స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సిందే. పసివయసులోనే ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న చిన్నారులు ఎవరికి చెప్పాలి వారి సమస్యల పరిష్కారానికి దారేది. చిన్నారుల కష్టాలను చిటికెలో పరిష్కరించే మార్గాన్ని కనుగొన్నారు. అదేంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

చిన్నారుల కోసం ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసులు. సమస్యలతో పాటు ఫిర్యాదులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. చిన్నారుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్‌లో వారికి తగ్గట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటుచేశారు. బచ్‌పన్‌ బచావో సంస్థ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు.

పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ప్రత్యేకంగా ఓ రూమ్‌ను తీర్చిదిద్దారు. పోలీస్‌స్టేషన్‌లో న్యాయ సలహాలు కల్పిస్తూ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, పచ్చదనం నెలకొన్న వాల్‌పోస్టర్లు, టేబుళ్లు, కుర్చీలు, మంచాలు తదితర సౌకర్యాలు కల్పించారు. కళాశాలలో, స్కూళ్లలో విద్యార్థుల సమస్యలపై ఎలా ఫిర్యాదు చేయాలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఇది. అంతేకాక రకరకాల ఆటలు ఆడిస్తూ సదరు పిల్లల నుంచి సమాచారం సేకరింస్తారు పోలీసులు.

బాధిత పిల్లలు, నేరాలకు పాల్పడే మైనర్లను ఈ పీఎస్‌లో ఉంచుతారు. పోలీసులు అంటే భయం పోయేలా చేసేందుకు ఇక్కడ ఉంటున్న పోలీస్ సిబ్బంది యూనిఫాంలో కాకుండా మఫ్టీలో కనిపిస్తారు. వివిధ అఘాయిత్యాలకు గురై వచ్చే పిల్లలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు వారికి భరోసా కల్పించేలా ఏర్పాట్లు చేశారు. పిల్లలు భయాందోళన చెందకుండా నిర్భయంగా మాట్లాడే వాతావరణాన్ని ఇక్కడ కల్పించారు.

రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సీపీ మహేశ్‌భగవత్ అన్నారు. ఐదేళ్ల పిల్లల నుంచి 18 ఏళ్ల పిల్లలు వారికి ఎదురయ్యే బాధలు, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ సమస్యలను ఈ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరించవచ్చని తెలిపారు. చిన్నారులలో మార్పుతీసుకు వచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశామన్నారు.

చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయడం చాలాబాగుందన్నారు సామాజికవేత్త సంధ్య. పిల్లల సంరక్షణ బాధ్యత పోలీసులదేనని వారిని మంచి మార్గంలో నడిపించేలా చూసుకోవాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి తమ సమస్యని చెప్పుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారికి ఫ్రెండ్లీ పోలీస్‌ మరో కొత్త ఆలోచనలతో చైల్డ్‌ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Keywords: Telangana, Child Friendly Police Station, Rachakonda, మేడిపల్లి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories