హుజూర్ ‌ఫలితం బీజేపీ అధ్యక్ష పీఠాన్ని కదిలిస్తోందా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి?

హుజూర్ ‌ఫలితం బీజేపీ అధ్యక్ష పీఠాన్ని కదిలిస్తోందా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి?
x
Highlights

తెలంగాణ బిజేపిలో హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం అంతర్మథనానికి గురి చేస్తోందా..? ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీకి ఒక్క శాతం ఓట్లు మాత్రమే రావడంతో,...

తెలంగాణ బిజేపిలో హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం అంతర్మథనానికి గురి చేస్తోందా..? ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీకి ఒక్క శాతం ఓట్లు మాత్రమే రావడంతో, పార్టీనేతలు తలలు పట్టుకుంటున్నారా..? పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కొత్త నాయకత్వం కోరుకుంటున్నారా..? పార్టీలో కొత్తగా వచ్చిన వారికే అవకాశమివ్వాలన్న డిమాండ్ పెరుగుతోందా..? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి పరిణామాలు. మరి కరడు గట్టిన కాషాయ పార్టీలో, ఇతర పార్టీల నేతలకు పీఠం దక్కుతుందా?

ఒక్క ఉపఎన్నిక తెలంగాణ బిజేపిని అంతర్మథనంలో పడేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానమే దక్కినా పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలు దక్కించుకొని కమలం పార్టీ జోరుమీదుందని ప్రచారం జరిగింది. తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పడంతో పోలోమంటూ ఇతర పార్టీల నుంచి అనేకమంది నేతలు కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తెలంగాణలో భవిష్యత్తు తమదేనని పదేపదే బిజేపి సీనియర్లు చెప్పడంతో, గంపెడాశాలు పెట్టుకుని కండువా మార్చుకున్నారు. అయితే, ఒక్క హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం, వారందర్నీ గందరగోళంలో పడేసిందన్న చర్చ, బీజేపీలో జరుగుతోంది. అంతేకాదు, ఈ ఎఫెక్ట్‌ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను సైతం కార్నర్ చేసిందన్న మాటలు వినిపిస్తున్నాయి.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పూర్తయి, ఫలితం రావడంతో ఒక్కసారిగా బిజేపి అసలు స్వరూపం బయటపడిందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. కాంగ్రెస్ తాను గెలువకున్నా బిజేపికి వచ్చిన బోటాబోటి ఓట్లతో భలే ఖుషీగా వుంది. పోటాపోటీ ఇచ్చి, రెండోస్థానం దక్కించుకున్నా, తనకు చాలా ఇబ్బందని ఖద్దరు పార్టీ భ‍యపడింది. సెకండ్‌ ప్లేస్‌లో నిలిచి, ఇదిగో కాంగ్రెస్ పని అయిపోయింది, ఆల్టర్నేటివ్ తామేనని చెప్పుకుంటుందని టెన్షన్ పడింది. కానీ కాంగ్రెస్‌ భయపడినట్టు జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే, అంచనాలు ఆకాశమంతా పెంచేసి, ఉసూరుమనిపించడంతో, కమలం పార్టీ కార్యకర్తలే డీలా పడిపోయారన్న మాటలు వినిపిస్తున్నాయి. దీంతో బిజేపీకి గ్రామస్థాయిలో ఉన్న ఓటు బ్యాంక్‌పై చర్చ జరుగుతోంది. ఎంత మంది సీనియర్లు బిజేపిలో చేరినా, క్యాడర్ బిజేపి వైపు రాలేదని హజూర్ నగర్ ఫలితంతో తేలిపోయింది. కాంగ్రెస్ నేతలు వచ్చినా వారి వెంట క్యాడర్ రాకపోవడంతో ఫలితం ఇలా వచ్చిందనే చర్చ కూడా పార్టీలో ఉంది. అయితే హుజూర్ నగర్ ఫలితం, అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు ఇబ్బందిగా మారిందన్న చర్చ జరుగుతోంది.

బిజేపిలో సంస్థగత ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ అధ్యక్ష మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడున్న వారికి బాధ్యతలు కొనసాగిస్తే, పార్టీకి భవిష్యత్తు ఉండదనే వాదనలు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. పార్టీలో యువతకు గాని కొత్తగా పార్టీలో వచ్చిన వారికి గానీ, పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీకి ఫ్యూచర్‌ వుంటుందన్న డిస్కషన్ జరుగుతోంది. ఇప్పుడున్న వారికే మళ్లీ పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగిస్తే ఇతర పార్టీలో ఉన్నవారు కమలం గూటికి రావడానికి సుముఖత చూపరని ఆలోచిస్తోంది. కాంగ్రెస్ , టిడిపి , టిఆర్ఎస్ నుంచి బిజేపి గూటికి ముఖ్యమైన నేతలు రావాలంటే కొత్త వారినే సింహాసనంలో కూర్చోబెట్టాలని తలపోస్తోంది కమలం అధిష్టానం.

ముఖ్యమైన నేతలు వస్తే గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా అన్ని పార్టీల నేతలు బిజేపి వైపు చూస్తారనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి డికే అరుణ అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు పగ్గాలు అప్పగిస్తే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ , టిడిపి క్యాడర్ కలిసి వస్తుందని, పార్టీలో ఒకవర్గం అంచనా వేస్తోంది. లేకపోతే పార్టీ భవిష్యత్తు హుజూర్ నగర్ ఫలితం లాగే ఉంటుదని చర్చించుకుంటున్నారట. అయితే, డీకే అరుణతో పాటు, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు సైతం తమకు అవకాశమివ్వాలని అధిష్టానం వద్ద ఓత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరి పార్టీ ఎవరికి పట్టం కడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories