తెలంగాణలో బతుకమ్మ శోభ..బతుకమ్మ పండుగకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర

తెలంగాణలో బతుకమ్మ శోభ..బతుకమ్మ పండుగకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర
x
Highlights

పండుగకు చరిత్ర ఉంటుందా.. ఉంటుంది.. దానికి ఉదాహరణే బతుకమ్మ. వేలాది ఏళ్ల చరిత్ర.. తెలంగాణ సంస్కృతి, ప్రకృతి తత్వమూ ఈ పండుగలో మేళవించి ఉంటాయి. ప్రతి సంవత్సరమూ ప్రపంచవ్యాప్తంగా వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది.

బతుకును ఇచ్చే అమ్మ పండుగే బతుకమ్మ. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచీ అక్టోబర్ 6 వరకూ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా 28న శనివారం వరంగ‌ల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఈ పండుగను నిర్వహించబోతోంది.

తెలంగాణతో పాటూ ముంబై, బెంగళూరు, కర్నాటకలోనూ బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు కావాల్సిన సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చివరి రోజున అంటే అక్టోబర్ 6న ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్​బండ్​వరకు ర్యాలీ జరగనుంది. ముగింపు వేడుకలు ట్యాంక్​బండ్​పై జరగనున్నాయి. భారతదేశంతో పాటూ మరో ఆరు దేశాల్లో బతుకమ్మ సంబురాలు జరగబోతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌, యూకే, ఖతార్‌‌‌‌, బహ్రైన్‌‌‌, కువైట్‌‌‌‌ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ప్రకృతితో ముడిపడే అద్భుతమైన పండుగ బతుకమ్మ. దసరా నవరాత్రుల సమయంలోనే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఒక్కో రోజు ఒక్కో రూపంలో బతుకమ్మను పేరుస్తారు. గునుక పువ్వు, తంగేడు పువ్వులు, ఇతర పుష్పాలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. పెద్దలు, పిల్లలు అందరూ ఒక చోట చేరి బతుకమ్మ పాటలు పాడి పూజలు చేస్తారు. వాయినాల్లో బెల్లం, సజ్జలు, పప్పు ధాన్యాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు. అలా చిరుధాన్యాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని ఈ పండుగ తెలియజేస్తుంది. నిజానికి ఈ పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచే బతుకమ్మను జరుపుకుంటున్నట్లు ఆధారాలున్నాయి.

బతుకమ్మ ఇలా ముస్తాబవుతుంది..

ఒక పళ్లెంలో గుమ్మడి ఆకులు పరిచి వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి అక్కడే తంగేడు, బీర, గన్నేరు, నిత్యమల్లె, బంతిపూలను ఒక్కో వరుసలో ఉంచుతారు. ఇలా ప్రకృతి నుంచి ప్రత్యక్షమయ్యే పూలమాత బతుకమ్మ. ఎనిమిది రోజులపాటూ అమ్మవారికి పూజలు చేసిన తర్వాత తొమ్మిదో రోజు అష్టమినాడు జరిగే సద్దుల బతుకమ్మకు భారీ ఎత్తున పూజలు చేసి పత్రితో సహా నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పూలు, పత్రిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అవి చెరువుల్లోని నీటిలో కలుస్తాయి. అలా కలిసిన నీరు పొలాలకు వెళ్తుంది. ఆ నీటిలో ఔషధ గుణాల వల్ల క్రిములు నశించి పంట పొలాలు చక్కగా పెరుగుతాయి. తద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యం, కరుణ కటాక్షాలతో వర్ధిల్లుతుంది. ఇదే బతుకమ్మ పండుగలో ఔన్నత్యం.

ప్రస్తుతం బతుకమ్మ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్‌ ఎల్బీనగర్ స్టేడియం వేదికగా నిర్వహించిన మహా బతుకమ్మ ఉత్సవాలు గిన్నిస్‌ గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డులకు ఎక్కాయి. తెలగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఏటా ఆడపడుచులకు ప్రత్యేకంగా బతుకమ్మ చీరలు ఉచితంగా ఇస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories