తన భూమి కబ్జా చేశారంటూ జవాను ఆవేదన..

తన భూమి కబ్జా చేశారంటూ జవాను ఆవేదన..
x
Highlights

ఈ జవాను పేరు స్వామి... ఇతని సొంతూరు... కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల... అయితే తన గ్రామంలో సొంత భూమికి రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నాడు....

ఈ జవాను పేరు స్వామి... ఇతని సొంతూరు... కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల... అయితే తన గ్రామంలో సొంత భూమికి రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నాడు. భూమికే కాదు... తన తల్లిదండ్రులూ భద్రత లేకుండా పోయిందని ఆర్మీ జవాను స్వామి ఆందోళన చెందుతున్నాడు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుంటే... తన భూమిని కబ్జా చేశారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశాడు. పైగా తన తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. అధికారుల చుట్టూ కాళ్లేరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని, తీవ్ర మనోవేదనకు గురై ఈ సెల్ఫీ వీడియో పోస్ట్‌ చేస్తున్నట్లు తెలిపాడు. ఇంటి దగ్గరి పరిస్థితులతో తాను డ్యూటీ చేయాలా? వద్దా? ఇంటికొచ్చేయాలా? తెలియక సతమతమవుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశాడు. తమకు న్యాయం జరిగేలా.... ఈ వీడియో... ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చేరేలా అందరూ షేర్ చేయాలంటూ కోరాడు.

తమ భూమిని పిప్పిరి ఆంజనేయులు ఆక్రమించుకుని తమను చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆర్మీ జవాను తండ్రి సాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. తమ భూమిని తన ప్రమేయం లేకుండా, తమ సంతకాలు లేకుండా అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని జవాను తండ్రి సాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

ఆర్మీ జవాను వీడియో, అతని తండ్రి సాయిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన తాడ్వాయి తహశీల్దార్‌.... ఈ భూమి వివాదంపై వివరణ ఇచ్చారు. ఆర్మీ జవాను చెబుతున్న భూమిని... గుండ్రెడ్డి సంగారెడ్డి అనే వ్యక్తి నుంచి పిప్పిరి ఆంజనేయులు 2018 జులైలో కొనుగోలు చేయగా, ఆన్ లైన్‌ దరఖాస్తు చేసుకోవడంతో... ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఈ భూమి తమదంటూ ఆర్మీ జవాన్ తండ్రి సాయిరెడ్డి ఫిర్యాదు ఇచ్చారని, దాంతో దీనిపై విచారణ చేపట్టినట్లు తాడ్వాయి తహశీల్దార్ వివరించారు.

అయితే విచారణ చేసిన తర్వాత ఈ భూమిని 15ఏళ్ల క్రితం గుండ్రెడ్డి సంగారెడ్డి నుంచి శారాబాయి ద్వారా సాయిరెడ్డి కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. అయితే ఈ భూమి విషయమై సంగారెడ్డి-సాయిరెడ్డి మధ్య గొడవలు జరిగాయని, దాంతో గుండ్రెడ్డి సంగారెడ్డి కోర్టుకెళ్లి ఆ భూమి తనదని ఆర్డర్ తెచ్చుకోవడంతో... అతనికే పాస్‌ బుక్కులు ఇచ్చామన్నారు. ఆ తర్వాత ఆ భూమిని సంగారెడ్డి.... పిప్పిరి ఆంజనేయులుకు విక్రయించడంతోనే ప్రొసీడింగ్స్ ఇఛ్చినట్లు తెలిపారు. ఈ వివాదంపై ఆర్డీవో, కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామని, అయితే తాజా వివాదంతో సివిల్ కోర్టుకు వెళ్లాలని ఆర్డీవో సూచించినట్లు తాడ్వాయి తహశీల్దార్‌ క్లారిటీ ఇచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories