ఓ ఆయా జీవితంలో విషాదం మిగిల్చిన విద్యుత్‌షాక్‌

ఓ ఆయా జీవితంలో విషాదం మిగిల్చిన విద్యుత్‌షాక్‌
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం ఓ నిండు జీవితంలో విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్ షాక్ తగిలి చేతులు, కాళ్లను...

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం ఓ నిండు జీవితంలో విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్ షాక్ తగిలి చేతులు, కాళ్లను కోల్పోవాల్సిన దయనీయ స్థితిని కల్పించింది. దాంతో శరీరంలో పూర్తిగా ఇన్‌ఫెక్షన్‌ పెరిగిపోయి అవయవాలను తొలగించే పరిస్థితి తీసుకొచ్చింది. దీంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఈ హృదయవిదారక సంఘటన గురించిన పూర్తివివరాల్లోకెళితే దౌల్తాబాద్‌ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా కరికె కళావతి జూన్‌ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతన్న సమయంలో విద్యుత్‌షాక్‌ గురై తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే.

అయితే ఈ సంఘటనలో ఆమె గాయాలపాలవడమే కాకుండా మరో వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. దీంతో వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఏ ఆస్పత్రిలో కూడా వైద్యులు ఆమెను జాయిన్ చేసుకోకపోవడంతో తిరిగి గజ్వేల్‌కు తెచ్చారు. అప్పటి నుంచి ఆమె గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఆమె ఉన్న పరిస్ధితిని తెలుసుకన్న మంత్రి హరీశ్ రావు ఈనెల 7న స్వయంగా ఆసుపత్రిని సందర్శించి కళావతి పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆమెకు తక్షణ సాయం కింద రూ. 50వేలు అందించారు. అంతే కాదు ఆమెకు వెంటనే శస్త్ర చికిత్సలు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మహేష్‌ను ఆదేశించారు. అంతే కాదు ఆమెకు జీవిత కాలం ప్రభుత్వ వేతనం వచ్చేలా చూస్తానని కొంత నగదును కూడా ఆమె వ్యక్తిగత ఖాతాలో జమచేస్తానని హామీ ఇచ్చారు.

ఇక బుధవారం రోజున ఆమె చేతులు, కాళ్లలో రక్త ప్రసరణ అగిపోవడమేగాకుండా ఒంట్లో ఇన్‌ఫెక్షన్‌ కూడా రెట్టింపు అయింది. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆమె మరింత ప్రమాదానికి గురవుతుందని గుర్తించిన వైద్యులు వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. ఆమె మోకాళ్ల కింది వరకు రెండు కాళ్లను, మోచేతి కిందికి ఎడమ చేయిని, మోచితిపైకి కుడి చెయ్యిని తొలగించారు. ఆ తరువాతే ఆమె పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మహేష్‌ తెలిపారు. కళావతికి జరిగిన శస్త్ర చికిత్స తన కేరీర్‌లోనే అరుదైనదిగా డాక్టర్‌ మహేష్‌ అభివర్ణించారు.ఈ అరుదైన శస్త్రచికిత్సలో ముగ్గురు ఆర్థోపెడిషియన్లు, ముగ్గురు మత్తు మందు డాక్టర్లు, ఒక సర్జన్, ఐదుగురు స్టాఫ్‌ నర్సులు, ఇద్దరు థియేటర్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories