Top
logo

మద్యం అమ్మితే రూ. 20 వేల జరిమానా..సమాచారమిస్తే రూ. 10 వేలు బహుమానం

మద్యం అమ్మితే రూ. 20 వేల జరిమానా..సమాచారమిస్తే రూ. 10 వేలు బహుమానం
Highlights

అదో గ్రామం. ప్రశాంతంగా వుండే ఆ ఊరిలో బెల్ట్ షాపులు చిచ్చు పెట్టాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ...

అదో గ్రామం. ప్రశాంతంగా వుండే ఆ ఊరిలో బెల్ట్ షాపులు చిచ్చు పెట్టాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ మద్యానికి బానిస అవుతున్నారు. కుటుంబాల్లో కలహాలు చెలరేగుతున్నాయి. పరిస్థితి చేయిదాటిపోతున్న దశలో యువకులు మేల్కొన్నారు. పాలకవర్గం చేత గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధించారు. మద్యంపై యుద్ధం ప్రకటించిన కామారెడ్డి జిల్లా అంబారీపేటపై స్పెషల్ స్టోరీ.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారీ పేట గ్రామం. నిన్నటివరకు ఈ గ్రామంలో మందుబాబులు హల్ చల్ చేసేవారు. బడి, గుడి అనే తేడా లేకుండా మద్యం సేవించేవారు. 3 వేల జనాభా ఉన్న అంబారీపేటలో 4 బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు జరుగతుండేవి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాక అమ్మకాలు కొనసాగుతుండేవి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా చిన్నాపెద్ద మద్యం తాగేవారు.

గ్రామంలో మద్యం తాగి యువత గొడవపడేవారు. కుటుంబల్లో కలహాలు చెలరేగుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన గ్రామస్తులు మద్య నిషేధం విధించాలని డిమాండ్ చేయగా, పాలకవర్గం తీర్మానం ఆమోదించింది. ఆదాయం లేకున్న ఫర్వాలేదు గ్రామం ప్రశాంతంగా వుండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇక నుంచి అంబారీపేటలో మద్యం విక్రయిస్తే 20 వేల జరిమానా, అమ్మకాలపై సమాచారం ఇచ్చేవారికి 10 వేలు బహుమతిని పంచాయతీ ప్రకటించింది. మద్యం ముట్టుకోబోమని గాంధీ మహాత్ముడి సాక్షిగా గ్రామస్తులు ప్రమాణం చేశారు. అంబారీపేట పాలకవర్గం తీర్మానం చుట్టుపక్కల గ్రామాలకు స్ఫూర్తినిస్తోంది. మద్య నిషేధం అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.


Next Story