కారుణ్య మరణానికి అనుమతి కోరుతోన్న యువ జంట

కారుణ్య మరణానికి అనుమతి కోరుతోన్న యువ జంట
x
Highlights

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. పేయింటర్‌గా పనిచేస్తూ అతడు.. కూలీ చేస్తూ ఆమె సంతోషంగా గడిపారు. అయితే వాళ్ల...

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. పేయింటర్‌గా పనిచేస్తూ అతడు.. కూలీ చేస్తూ ఆమె సంతోషంగా గడిపారు. అయితే వాళ్ల సంతోషం రెండేళ్లకే ఆవిరైపోయింది. బ్రెయిన్ ట్యూమర్ ఆమెను జీవచ్చవంలా మార్చేసింది. దీంతో భార్యకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు ఆ యువ దంపతులు. అయితే ఆ దంపతుల ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటి..? వారు పడుతోన్న కష్టాలేంటి..?

భార్యను చంటి బిడ్డలా మోసుకొస్తున్న ఇతని పేరు పండరి. కనీసం నిలబడలేని దీనావస్థలో ఉన్న ఈమె పేరు స్వరూప. కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన స్వరూప-పండరి మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లి పేయింటర్ గా పండరి, కూలీగా స్వరూప పనిచేస్తూ.. తమ బతుకు బండి లాగించారు. రెండేళ్ల వరకు బాగానే ఉన్నా.. ఏడాది క్రితం స్వరూప కు బ్రెయిన్ ట్యూమర్ సోకింది.

ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పు చేసి భార్యకు ఆపరేషన్ చేయించాడు. వ్యాధి నయంకాకపోగా స్వరూప మంచానికే పరిమితం అయ్యింది. వ్యాధి నయం కావాలంటే మరో 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆమెను తన సొంతూరుకు తీసుకొచ్చాడు. రోజురోజుకు ఆరోగ్య క్షిణించి స్వరూప జీవచ్చవంలా మారుతోంది. దీంతో పండరి ఆమెకు అన్నీ తానై సపర్యలు చేస్తున్నాడు. తన భార్యకు చంటి బిడ్డలా సేవ చేస్తూ.. కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. భార్యను ఇంట్లో వదిలి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆ కుటుంబం పూటపూటకు కన్నీళ్లను మింగుతోంది. తినేందుకు తిండి లేక.. పెట్టేందుకు నా అనే వాళ్లు రాక పస్తులుంటున్నారు.

వైద్యం చేయించే స్తోమత లేక దేవుడిపై భారం వేసి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది ఆ యువ జంట. సర్కారు సాయం చేసి పునర్జన్మ ప్రసాదించాలని వేడుకుంటూనే సాధ్యం కాకపోతే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. ప్రేమ పెళ్లితో అందరూ ఉండి అనాథలుగా మారారు ఈ యువ దంపతులు. భార్య పడుతున్న నరకాన్ని చూడలేక.. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు పండరి. ఇటు భర్తతో సేవ చేయించుకునే దీన స్థితిని చూసి స్వరూప కన్నీటి పర్యంతం అవుతోంది.

ప్రస్తుతం స్వరూపకు ఓ చేయి కాలు పనిచేయడం లేదు. తనంతట తానుగా నడవలేదు... కూర్చో లేదు. భర్త సపోర్టు ఉంటే తప్ప కనీసం నీళ్లు కూడా తాగలేని దయనీయ స్థితిని చూస్తూ కుమిలిపోతుంది ఆ బాధితురాలు. మనవతా మూర్తులు ఆపన్న హస్తం అందించి తనకు పునర్జన్మ ప్రసాదించాలని కోరుకుంటోంది స్వరూప. లేకపోతే ప్రభుత్వమే మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలని వేడుకుంటోంది. భార్య వైద్యానికి సరిపడా డబ్బులు లేక.. భార్య పడుతున్న నరకాన్ని చూడలేక తనలో తాను కుమిలిపోతున్నాడు పండరి. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories