గాల్లో దీపంలా మారిన పర్యాటకుల ప్రాణాలు..

గాల్లో దీపంలా మారిన పర్యాటకుల ప్రాణాలు..
x
Highlights

గోదావరి మరోసారి గర్జించింది. నదీ అందాలను వీక్షించాలనుకున్న ప్రయాణీకులను మరోసారి అమాంతం మింగేసింది. పాపికొండల దృశ్యాలను మదిలో చిరస్మరణీయంగా...

గోదావరి మరోసారి గర్జించింది. నదీ అందాలను వీక్షించాలనుకున్న ప్రయాణీకులను మరోసారి అమాంతం మింగేసింది. పాపికొండల దృశ్యాలను మదిలో చిరస్మరణీయంగా దాచుకునేందుకు బోటులో బయల్దేరిన ప్రయాణీకులను తిరిగిరాని గమ్యాలకు చేర్చింది. వరుస బోటు ప్రమాద సంఘటన మరోసారి ప్రయివేటు బోట్ల నిర్వహణల్లోని లోపాలను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ప్రయివేటు బోటు నిర్వాహకుల అత్యాశ, అధికారుల నిర్లిప్తధోరణి వెరసి ఆహ్లాదాన్ని పంచాల్సిన పర్యాటకం ప్రమాదాలకు బాటలు వేస్తోంది

గోదావరిలో వరుస పడవ ప్రయాణాలు ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విషాదాలు ఆగడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో గతేడాది రెండు భారీ ప్రమాదాలు జరిగిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన జరగడంతో ఏపీప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. వరుస ప్రమాదాలతో పెద్దసంఖ్యలో ప్రాణాలను బలితీస్తూ తీవ్ర విషాదాన్ని నింపుతోంది. గోదావరిలో జరిగిన వరస ప్రమాదాలు ఆదివారమే జరగడం భయాందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది జూలై 14న పశువుల్లంకలో నాటు పడవ మునిగిన ఘటనలో అభంశుభం తెలియని విద్యార్థులు మృతి చెందిన ఘటన ఇప్పటికి కన్నీరు పెట్టిస్తోంది. పశువుల్లంక-సలాదివారిపాలెం వద్ద గోదావరిలో ప్రయాణిస్తున్న ఫంటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రమాదానికి గురైంది. ఇప్పటి ఈ ఘటనను తలచుకుంటూ భయాందోళన చెందుతున్నారు స్థానికులు.

1964లో ఉదయభాస్కర్ బోటు మునిగి 60 మంది మృతిచెందారు. 1995లో తూగో జిల్లా పాపికొండల మార్గంలో జరిగిన బోటు ప్రమాదంలో 98 మంది చనిపోయారు. 2009లో తూర్పు జిల్లా దేవీపట్నం మండలం, కొండమొదలు దగ్గ ర పడవ ప్రమాదంలో 10 మంది మరణించారు. నవంబరు 18, 2012లో పి. గన్నవరం వద్ద బోటు బోల్తా పడి 5 మంది మహిళలు చనిపోయారు. ఇవికాక అనేకసార్లు బోట్లు నది మధ్యలో ప్రమాదాలకు గురైనా ప్రాణ నష్టం జరగలేదు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం, తగిన జాగ్రత్తులు తీసుకోక పోవడం వల్ల వరుస పడవ బోల్తా సంఘటనలు జరుగుతున్నాయి.

గోదావరిలో అనేక ప్రమాద ఘటనలు జరిగి వందలమంది ప్రయాణికులు మరణించారు. వాటినుండి ప్రభుత్వాలు ఎటువంటి గుణపాఠాలను నేర్చుకోవడంలేదు. ఇలా వరుస ప్రమాదాలు జరగుతున్న అధికారుల్లో మాత్రం చలనం కదలడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప... ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories