రోజులు గడుస్తున్నా చర్చలకు దిగిరాని ప్రభుత్వం...కొనసాగనున్న ఆర్టీసీ సమ్మె

రోజులు గడుస్తున్నా చర్చలకు దిగిరాని ప్రభుత్వం...కొనసాగనున్న ఆర్టీసీ సమ్మె
x
Highlights

రోజులు గడుస్తున్నా చర్చలపై ఎలాంటి ముందడుగు పడకపోవడంతో ఆర్టీసీ సమ్మె 16 వ రోజూ కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వం బెట్టువదలకపోవడంతో అటు ఆర్టీసీ జేఏసీ పట్టువిడకపోవడంతో ప్రయాణీకులకు తిప్పలు తప్పడం లేదు.

రోజులు గడుస్తున్నా చర్చలపై ఎలాంటి ముందడుగు పడకపోవడంతో ఆర్టీసీ సమ్మె 16 వ రోజూ కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వం బెట్టువదలకపోవడంతో అటు ఆర్టీసీ జేఏసీ పట్టువిడకపోవడంతో ప్రయాణీకులకు తిప్పలు తప్పడం లేదు. నిన్న తెలంగాణ బంద్‌ నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ ఇవాళ అఖిలపక్షం నేతలతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. దీపావళి ముందు రోజు వరకు వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అలాగే విధులకు హాజరుకావొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోసారి గవర్నర్‌ను కలిసి సమ్మెపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. రేపు అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ కార్మికులు నిరసన తెలియజేస్తామని, 22 న తమ పొట్ట కొట్టొద్దంటూ తాత్కాలిక ఉద్యోగులకు విజ్ఞప్తి చేయనున్నారు. 23 న అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులతో సమావేశం, ఓయూలో బహిరంగ సభ, 24 న మహిళా కండక్టర్ల ర్యాలీ, 25 న రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధం, 26 న కుటుంబాలతో కలిసి నిరసన ఉంటుందని తెలిపారు. ఈ నెల 30 న సకల జనుల సమరభేటీ నిర్వహిస్తామని అశ్వత్థామరెడ్డి వివరించారు.

మనోవేదనకు గురవుతున్న ఆర్టీసీ కార్మికులు

ఇటు సమ్మె వల్ల తీవ్ర మనోవేధనకు గురవుతున్న కార్మికులు చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఖాజా మియా ఈ ఉదయం గుండెపోటుతో మరణించాడు. ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖ‌రిపై గత కొన్నిరోజులుగా మనస్తాపంతో ఉన్న ఖాజామియా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు నల్గొండ డిపోకు చెందిన కండక్టర్‌ మల్లయ్య మృతిచెందాడు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

మరోవైపు నిజామాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. కోరుట్ల నుంచి నిజామాబాద్ వస్తున్న బస్సు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతుడిని బీహార్ కు చెందిన మాణిక్ బండార్ గా గుర్తించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని స్ధానికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితమే నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడపడంతో ప్రయాణీకులు భయపడుతున్నారు.

ఇక నిరసనలో భాగంగా వామపక్షాలు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. 16 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరితోనే సమస్య జఠిలమవుతోందని వామపక్ష నేతలు విమర్శించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories