అదే కుటుంబానికి చెందిన మరో మహిళ మృతి

అదే కుటుంబానికి చెందిన మరో మహిళ మృతి
x
Highlights

♦ దోమకాటుకు తాత, తండ్రి, మనవరాలు మృతి ♦ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయిన సోన ♦ మూడు తరాలను మింగిన డెంగ్యూ

♦ఆ కుటుంబాన్ని డెంగ్యూ వెంటాడింది. ఒకరి తర్వాత ఒకరిని బలి తీసుకుంది. రోజుల వ్యవధిలోనే మూడు తరాలకు చెందిన నలుగురిని కాటికి పంపించింది. ఒక్క దోమ వల్ల ఏకంగా ఆ కుటుంబం మొత్తం కుదేలైంది. మంచిర్యాలకు చెందిన గుడిమల్లు రాజగట్టు కుటుంబాన్ని పగబట్టిన డెంగ్యూ అందరి ప్రాణాలు తీసింది.

డెంగ్యూ వ్యాధితో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని తెలుసు ఒక్కోసారి ఆ ప్రాణాలు పోతాయనీ తెలుసు. కానీ ఆ కుటుంబాన్ని మాత్రం ఆ డెంగ్యూ దోమ పగబట్టినట్లుంది. 15 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన గుడిమల్లు రాజగట్టు కుటుంబాన్ని డెంగ్యూ మింగేసింది. మూడు తరాలకు చెందిన వారిని కాటికి పంపించింది. తాజాగా సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజగట్టు భార్య సోన ప్రాణాలు విడిచింది.

గర్భిణి అయిన సోన డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ రెండు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంగళవారం చిన్నారి బాబుకు జన్మనిచ్చిన సోనను ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తర్వాత మృతిచెందింది. దీంతో రాజగట్టు కుటుంబంలో మంగళవారం పుట్టిన చిన్నారి మినహా మిగతా నలుగురిని డెంగ్యూ దోమ బలితీసుకుంది.

ఇప్పటికే డెంగ్యూ వ్యాధితో రాజగట్టు మరణించగా ఆ తర్వాత అతడి తండ్రి లింగయ్య కూడా అదే వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికే గర్భిణి అయిన రాజగట్టు భార్యకు, ఆమె కూతురు వర్షిణికి కూడా అదే వ్యాధి సోకింది. దీంతో తీవ్ర జ్వరంతో ఆరేళ్ల చిన్నారి వర్షిణి కూడా డెంగ్యూ బూతానికి బలైంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన జిల్లా వైద్యశాఖ అధికారులు రాజగట్టు ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అయితే తాజాగా రాజగట్టు భార్య సోన కూడా ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

మంచిర్యాల జిల్లా వైద్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వరుస మరణాలతో తేటతెల్లమైంది. ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు, కూతురు, వారి తండ్రి కూడా మరణించడం అత్యంత బాధాకరం. సరైన మందులు అందుబాటులో లేకపోవడం దోమకాటును పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఈ మరణాలు సంభవించినట్లుగా చెబుతున్నారు. పేదకుటుంబాల్లో చాలామంది డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారని ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు సకాలంలో స్పందిస్తే ఇంతటి దారుణాలు జరిగేవి కావని చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories