Top
logo

టీమిండియా ప్రియమైన ప్రత్యర్థితో అమీ..తుమీ!

టీమిండియా ప్రియమైన ప్రత్యర్థితో అమీ..తుమీ!
X
Highlights

అవును.. ఈరోజు జరగబోతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ప్రత్యర్థి న్యూజిలాండ్ ప్రియమైన ప్రత్యర్థి....

అవును.. ఈరోజు జరగబోతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ప్రత్యర్థి న్యూజిలాండ్ ప్రియమైన ప్రత్యర్థి. ఎందుకంటే, భారత జట్టు తో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లీ సేన అభిమానులందరూ కూడా న్యూజిలాండ్ తోనే మన సెమీ ఫైనల్ ఉండాలని కోరుకున్నారు. అంత ప్రేమగా కోరుకున్నారు కాబట్టి న్యూజిలాండ్ ప్రియమైన ప్రత్యర్థి అవుతుంది. ఇక విషయానికి వస్తే మరి కొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇరు జట్లూ అమీ.. తుమీ కి సిద్ధమైపోయాయి. కచ్చితంగా గెలిచి ఫైనల్ ఆడి కప్ ఎగరేసుకుపోవాలనే పట్టుదల ఒకరిది.. సెమీఫైనల్ గండం గట్టెక్కి ఫైనల్స్ కు చేరాలనే ఆరాటం మరొకరిది. జీవన్మరణ సమస్య లాంటి పోరు ఇది. అభిమానులకు ఎంత టెన్షన్ పడుతున్నారో అంతకంటే ఎక్కువ ఇరువైపులా ఆటగాళ్లకి ఒత్తిడి ఉంది. ఒత్తిడిని జయించిన వారే ఈరోజు విజేతలుగా నిలబదతారనడంలో సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా లో ఎవరెవరు వుంటారు.. న్యూజిలాండ్ ఎవరిని ఆడిస్తుంది.. ఇంతవరకూ ఈ జట్ల ప్రదర్శన ఎలా ఉంది.. ఇవన్ని ఓసారి అవలోకిద్దాం..

భారత్ జట్టు లో మార్పులు ఉండకపోవచ్చు..

విజయాల పరంపరలో ఉన్న భారత జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. రోహిత్ శర్మ సెంచరీలతో పునాదులు వేస్తున్నాడు.. వాటి మీద కోహ్లీ కూడా మంచి స్కోరుకు బాటలు వేస్తున్నాడు. ఇక చూసుకోవాల్సింది నాలుగో స్థానమే అయినా ప్రస్తుతం పంత్ అక్కడ కుడురుకున్నట్టే. ఇక పాండ్యా దూకుడు ఉండనే ఉంది. ఎటొచ్చీ.. ధోనీ ధనా ధన్ ల కోసమే ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. నాకౌట్ మ్యాచ్ కాబట్టి ఆ మ్యాజిక్ కూడా చూసేయవచ్చు అని ఆశిస్తున్నారు అభిమానులు. ఇక బౌలింగ్ విషయంలో భారత్ కు పెద్ద టెన్షన్ లేదు. ఇద్దరు పేసర్లతో ఆడాలి అనుకుంటే జడేజా కొనసాగవచ్చు. లేదూ పిచ్ పరిస్థితి స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది అనుకుంటే, దినేష్ కార్తీక్ ప్లేస్ లో కేదార్ జాదవ్ ను తీసుకోవచ్చు. కానీ, గత మ్యాచ్ బలగాన్నే మార్చకుండా కొనసాగించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

బౌల్ట్ ను ఎదుర్కోవడమే కీలకం..

టీమిండియా ముందు ఉన్న అత్యంత క్లిష్టమైన పని బౌల్ట్ ను ఎదుర్కోవడం. ప్రారంభ ఓవర్లలో బౌల్ట్ ను ఎలా ఎదుర్కున్తారనే దానిపైనే బ్యాటింగ్ ఆధారపడుతుంది. ఎందుకంటే, బౌల్ట్ కు అవకాశం చిక్కిందా మొత్తం టీమిండియాని గుక్కతిప్పుకోనివ్వడు. రోహిత్, రాహుల్ జోడీ ముందున్న పెద్ద సవాల్ ఇదే.

వాళ్ళని కట్టడి చేయాల్సిందే!

న్యూజిలాండ్ టీం లో బలమైన బ్యాట్స్ మెన్ కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్, గుఫ్టిల్ త్రయం. వీరిలో విలియమ్సన్ ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్నాడు. అతడిని కట్టడి చేస్తే సగం పని అయిపోయినట్టే. ఇక సీనియర్ రాస్ టేలర్ వరుసగా విఫలం అవుతున్నాడు, గుఫ్టిల్ ఈ టోర్నీలో చాలా చెత్తగా ఆడుతున్నాడు. కానీ వీరు ఒక్కసారి నిలబడ్డారంటే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తారు. వీరిని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత బాగా విజయానికి దగ్గర కావచ్చు.

పిచ్ బ్యాటింగ్ కే అనుకూలం..

ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ బ్యాటింగ్ కే అనుకూలిస్తుంది. ఇక్కడ భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇండియా ఇక్కడ ఈ టోర్నీ లో రెండు మ్యాచ్ లు గెలిచింది. పాకిస్తాన్, వెస్టిండీస్ ల పై గెలిచింది ఇక్కడే. ఇక కివీస్ విండీస్ ను ఇక్కడే ఓడించింది. మోర్గాన్ 17 సిక్సర్లు బాదిందీ ఇక్కడే. ఇక్కడ ఈ టోర్నీలో టాస్ కీలకం. తొలి బ్యాటింగ్ చేసిన జట్టు ఇప్పటివరకూ గెలుస్తూ వస్తోంది.

సెమీస్ లో మూడో టీము సిద్ధం.

రెండు టీములు ఆడే చోట మూడో తీమేన్తనుకున్తున్నారా? అదేనండి వర్షం. ఇక్కడ వర్షం కూడా నేనున్నానంటూ సిద్ధం అవుతోంది. ఒకవేళ వర్షం కారణంగా ఆట ఈరోజు సాధ్యం కాకపొతే రేపు (బుధవారం) జరుగుతుంది. అదీ సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానం లో ఉన్న ఇండియా ఫైనల్ కు నేరుగా వెళ్ళిపోతుంది. ఈరోజు కొద్ది సేపు మ్యాచ్ జరిగాకా ఆటకు అంతరాయం కలిగితే, ఎక్కడైతే ఆట ఆగిందో అక్కడ నుంచి రేపు ఆడతారు. అదీ సాధ్యం కాకపోతే ఇండియా ఫైనల్ కు చేరుతుంది.

మొత్తమ్మీద మరి కొన్ని గంటల్లో మొదటి సెమీస్ ప్రారంభం కాబోతోంది. విజయం ఎవరిని వరించినా మంచి పోటీని అయితే చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది రెండు జట్లకూ చావో..రేవో మ్యాచ్ కాబట్టి!

Next Story