ఎవరుంటారో.. రేపే వెస్టిండీస్ టూర్ కు టీమిండియా ఎంపిక!

ఎవరుంటారో.. రేపే వెస్టిండీస్ టూర్ కు టీమిండియా ఎంపిక!
x
Highlights

ప్రపంచ కప్ హడావుడి ముగిసినట్టే. విశ్లేషణలు.. విమర్శలు.. అన్నీ కుదురుకుంటున్నాయి. ఇక వెస్టిండీస్ ప్రయాణానికి టీమిండియా సిద్ధం కావాల్సిన సమయం...

ప్రపంచ కప్ హడావుడి ముగిసినట్టే. విశ్లేషణలు.. విమర్శలు.. అన్నీ కుదురుకుంటున్నాయి. ఇక వెస్టిండీస్ ప్రయాణానికి టీమిండియా సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. రేపు టీమిండియా సెలక్షన్స్ జరగబోతున్నాయి. వెస్టిండీస్ వెళ్ళే జట్టులో ఎవరెవరు సభ్యులో తేలిపోతుంది.

కెప్టెన్ రోహిత్ శర్మ?

దాదాపుగా రోహిత్ శర్మ కెప్టెన్ గా విండీస్ టూరుకు టీమిండియా వెళుతుందని తెలుస్తోంది. కోహ్లీ, బుమ్రా లకు విశ్రాంతి ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో భారత జట్టు పగ్గాలు రోహిత్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధోనీ చుట్టూ..

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సెలక్షన్ అంతా ధోనీ చుట్టూ తిరుగుతోంది. తన రిటైర్మెంట్ పై ఎటువంటి ప్రకటనా ధోనీ చేయకపోయినా.. ధోనీ టూర్ కు అందుబాటులో ఉంటాడో లేదో తెలియక బోర్డు సతమతమవుతోంది. ఇప్పటికే ఈ విషయంపై చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పడు ధోనీ వెస్టిండీస్ వెళతాడా? వెళ్ళినా కీపర్ గా ఉంటాడా.. లేక పెద్దన్న తరహాలో టీం కు సూచనలు ఇస్తూ పెవిలియన్ కు పరిమితమవుతాడా అనేది ప్రశ్న. ఒకవేళ ధోనీ టూర్ కు వెళ్లకపోతే రిషబ్ పంత్ కు అవకాశం వచ్చినట్టే.

కార్తీక్ ను కాదని పంత్ ఎందుకు?

దినేష్ కార్తీక్ సీనియర్ అయినప్పటికీ, సెలెక్టర్లు పంత్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. వరల్డ్ కప్ లో ధావన్ గాయపడిన తరువాత పంత్ ను మ్యాచుల్లో ఆడించడమే అందుకు నిదర్శనం. అందువల్ల జట్టులో పంత్ స్థానానికి ఇబ్బందులు లేనట్టే.

నాలుగో స్థానానికి ఎవరు?

ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రెండేళ్లలో నాలుగో స్థానానికి ఎన్నో ప్రయోగాలు జరిగాయి. అన్నీ విఫలమయ్యాయి. వరల్డ్ కప్ లో కూడా నాలుగో స్థానమే మన కొంప ముంచింది. ఇదే జట్టు కూర్పును దెబ్బతీస్తోంది. ధావన్ జట్టులోకి వస్తే.. రాహుల్ ఎప్పటిలా నాలుగులో వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే.. రాహుల్ ఓపెనర్ గా వస్తే కనుక పంత్ నాలుగులో ఆడించే చాన్స్ లేకపోలేదు. వీరు కాకుండా జట్టు ఎంపిక ఎలా చేస్తారన్నది చూడాల్సిందే. అయితే, కొత్తవాళ్ళను తీసుకునే ఉద్దేశ్యం ఉంటె..కర్ణాటక ఆటగాళ్లు మయాంక్‌ అగర్వాల్‌, మనీశ్‌ పాండే, ముంబయి క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ లలో ఒకరిని లేదా ఇద్దర్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. వీరు ముగ్గురూ దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నవారే కావడం గమనార్హం. ఈ పరిస్తితిలో సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంది.

బౌలింగ్ కూర్పు ఎలా?

భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి తప్పనిసరిగా జట్టులో ఉంటారు. ఇదే సమయంలో కొత్త వారిని తేసుకోవాలనుకుంటే.. దిల్లీ యువ పేసర్‌, భారత్‌-ఏ పర్యటనలో తన పేస్‌తో ఆకట్టుకున్న నవదీప్‌ సైనీకి చాన్స్ ఉండొచ్చు. ఎడమచేతి వాటం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ కూ చాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories