వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు సిద్ధమైన యువక్రికెటర్‌

వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు సిద్ధమైన యువక్రికెటర్‌
x
Highlights

ఊహ తెలిసే నాటి నుంచే అవిటితనం.. ఇక అంతా అయిపోయినట్లే అనుకుంటే అతనిప్పుడు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే వాడు కాదేమో చాలా తక్కువ మంది మాత్రమే ఓడిపోయిన...

ఊహ తెలిసే నాటి నుంచే అవిటితనం.. ఇక అంతా అయిపోయినట్లే అనుకుంటే అతనిప్పుడు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే వాడు కాదేమో చాలా తక్కువ మంది మాత్రమే ఓడిపోయిన జీవితాన్ని భవిష్యత్తులో గొప్పగా నిర్మించుకోడానికి కలలు కంటారు. వాటిని నిజం చేసుకోడానికి అహర్నిశలు కష్టపడుతారు. అలాంటి సూపర్ స్టారే సాగర్‌తీరానికి చెందిన రమేష్‌. తనదైన ఆటతో మిరాకిల్స్ చేస్తూ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న యువకుడిపై హెచ్‌ఎంటీవీ ప్రత్యేక కథనం.

బౌలింగ్‌లో వికెట్ల మోత మోగిస్తాడు. అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరహో అనిపిస్తాడు. మెరుగైన ఆటతీరుతో భారత క్రికెట్‌ సెలక్టర్లే మెప్పించాడు. వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు సిద్ధమైన యువక్రికెటర్‌. ఈ యువకుడు పేరు మంత్రి రమేష్‌ సుబ్రహ్మణ్యం నాయుడు. విశాఖ ఎంవీపీకాలనీకి చెందిన అతగాడి ఆశయం ముందు అవిటితనం ఓడింది. ఏకంగా భారత్‌ దివ్యాంగుల క్రికెట్‌ జట్టులో స్థానం దక్కేలా చేసింది. భారత్‌ దివ్యాంగుల జట్టు తరపున ఆగస్టు ఐదు నుంచి 17వ తేదీ వరకు ఇంగ్లాండ్‌లో జరగనున్న వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆడనున్నాడు.

తెలుగు రాష్ట్రాల నుంచి భారత్‌ దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు రమేష్‌ సుబ్రహ్మణ్యం నాయుడు ఒక్కడే ఎంపికయ్యాడు. సౌత్‌ జోన్‌ నుంచి నలుగురు ఎంపికవ్వగా, వారిలో రమేష్‌ ఒకడు కావడం విశేషం. 24 ఏళ్ల రమేష్‌ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యాభ్యాసం నగరంలోనే కొనసాగింది. దేశానికి అరుదైన గౌరవం అందించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంచి ఆల్ రౌండర్ గా పేరు సంపాదించుకున్న రమేష్‌ వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు.

మొదటి నుంచి క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టపడే రమేష్‌ను ఐఐటీలో కోచ్‌లైన రఘురామ్‌, కార్తీకేయన్‌, ప్రవీణ్‌లు ఎంతో ప్రోత్సహించారు. దీంతో ఆయన పలు రకాల క్రికెట్‌ పోటీల్లో విజయం సాధించి రాష్ట్ర స్థాయి క్రీడాకారునిగా ఎదిగాడు. తమిళనాడులోని రాష్ట్ర, సౌత్‌ జోన్‌, ఇండియా రెడ్‌, ఇండియా-సీ, ఇండియా ప్రోబబుల్స్‌లో ఉత్తమంగా నిలిచాడు. క్రికెట్‌లో బాగా రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించడంతో భారత్‌ దివ్యాంగుల క్రికెట్‌ జట్టులో రమేష్‌కు స్థానం లభించింది.

తల్లిదండ్రులు, స్నేహితులు, ఐఐటీ కోచ్‌ల సహాయ సహకారాలు భగవంతుని ఆశీస్సులతోనే క్రికెట్‌ జట్టులో స్థానం పొందానంటున్నాడు రమేష్‌. వచ్చే నెల ఐదు నుంచి ఇంగ్లాడ్‌లో జరగనున్న వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల్లో ఆడనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల క్రికెట్‌ జట్టు వరల్డ్‌ కప్‌లో ఆడడం ఇదే ప్రథమం కావడం భారత్‌ జట్టులో తమ నగరవాసికి స్థానం లభించడం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు. మెరుగైన ఆటతో రాణించి మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories