నొజోమి ఒకుహరకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న పీవీ సింధు...

నొజోమి ఒకుహరకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న పీవీ సింధు...
x
Highlights

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో తెలుగుతేజం పీవీ సింధు చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది.. రెండు కాంస్యాలు, మరో రెండు రజతాలతో మెగా...

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో తెలుగుతేజం పీవీ సింధు చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది.. రెండు కాంస్యాలు, మరో రెండు రజతాలతో మెగా టోర్నీలో తనదైన ముద్ర వేసిన సింధు ముచ్చటగా మూడోసారి టైటిల్‌ ఫైట్‌కు సిద్ధమైంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో వరల్డ్‌ మూడో ర్యాంకర్‌ చెన్‌ యుఫీని చిత్తు చేసిన సింధు.. కాజేపట్లో జరిగే టైటిల్‌ ఫైట్‌లో జపాన్‌ ప్లేయర్‌ నొజోమి ఒకుహరతో అమీతుమీకి సిద్ధమైంది.

సింధూను ఐదుసార్లుగా అందని ద్రాక్ష అయిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ పసిడి ఊరిస్తోంది.. దీంతో ఈసారి ఎలాగైనా దానిని సాధించాలన్న పట్టుదలతో ఉంది సింధు.. కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకొనే మధుర క్షణాలకు సింధు కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది. టోర్నీలో అమోఘ ఆటతో దుమ్ము రేపుతున్న సింధు సెమీఫైనల్లో 21-7, 21-14 స్కోరుతో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ యుఫీని మట్టికరిపించింది. ఇక ఫైనల్ లో కూడా సింధు అదేరకమైన ఆటతీరు కనబరుస్తుందని అందరూ భావిస్తున్నారు.. ఫైనల్లో సింధూనే ఫేవరెట్..

మరోవైపు జపాన్ ప్లేయర్ నొజోమి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా సింధూకి ఇదే సరైన సమయం.. 2017 వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సింధు-నొజోమి ఒకుహర 2017 ఫైనల్‌ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలుస్తుంది. 110 నిమిషాల ఆ సమరం బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే రెండో సుదీర్ఘ మ్యాచ్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో 21-19తో ఒకుహర నెగ్గింది.

మొదటి గేమ్‌ను మించి ఉత్కంఠ రేపిన రెండో గేమ్‌లో 20-20 వద్ద మూడు గేమ్‌ పాయింట్లు నొజోమి కాపాడుకుంది. కానీ పట్టువదలని సింధు 73 షాట్ల సుదీర్ఘ ర్యాలీతో పాయింట్‌ కైవసం చేసుకొని 22-20 రెండో గేమ్‌ను చేజిక్కించుకుంది. ఇక ఇద్దరు షట్లర్ల మానసిక, శారీరక సామర్థ్యాలకు సవాలుగా నిలిచిన మూడో గేమ్‌లో 22-20తో అంతిమంగా ఒకుహరదే పైచేయి అయింది. మరి.. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సింధూకి సరైన అవకాశం...

మొత్తానికి ఒక పక్క అందని ద్రాక్షలా ఊరిస్తున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ సోంతం చేసుకోవాలని.. మరోవైపు 2017లో ఓటమికి రిటర్న్ గిఫ్ ఇవ్వాలని సింధూ ఉవ్విళ్లూరుతోంది.. ఈ ఉత్కంఠ పోరుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాడ్మింటన్ ప్రియులు వెయిట్ చేస్తున్నారు..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories