Top
logo

ఒక్క రనౌట్..

ఒక్క రనౌట్..
Highlights

ఒక రనౌట్ జీరోను హీరో చేసింది. ఆ రనౌట్ లక్షలాది గుండెల్ని పిండేసింది. ఆ రనౌట్ ఒక కూలెస్ట్ హీరోకు...

ఒక రనౌట్

జీరోను హీరో చేసింది. ఆ రనౌట్

లక్షలాది గుండెల్ని పిండేసింది. ఆ రనౌట్

ఒక కూలెస్ట్ హీరోకు మరవలేని వేదన అయింది.

అవును.. ధోనీ రనౌట్ కాకపోయుంటే కథ వేరేగా ఉండేది. వరల్డ్ కప్ టోర్నీ మొదలైంది మొదలు న్యూజిలాండ్ టీములో అభిమానుల్ని నిరాశ పరుస్తూ విసుగు తెప్పించిన గుప్తిల్ ని హీరో చేసింది. ఆడిన అన్ని మ్యచుల్లోనూ బ్యాట్స్ మెన్ గా విఫలమైన గుప్తిల్ కీలకమైన దశలో విసిరిన ఒక్క బంతి అతని వైఫల్యాలన్నిటినీ వెనక్కు నెట్టేసింది. సెమీస్ రావడమే కష్టం అనుకున్న టీమ్ ఇప్పుడు బలమైన ప్రత్యర్థిని ఓడించి ఫైనల్ కు సిద్ధమయ్యేలా చేసింది.

మరో వైపు టీమిండియా కలల్ని కాలరాసింది కూడా ఆ రానౌటే. ధోనీ.. కూలెస్ట్ క్రికెటర్. ఆరు వికెట్లు 92 పరుగులే కోల్పోయిన జట్టు రెండొందల పరుగులు చేయగలదని ఎవరూ భావించరు. అందులోనూ.. ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో. ఆ స్థితిలో ఆడటం మామూలు విషయం కాదు. ఒత్తడిని తట్టుకుంటూ.. అంతకు మించి అవతలివైపు ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడికి సహకరిస్తూ.. లక్ష్యం వైపు నిదానంగా జరుగుతూ.. అది ఎం.ఎస్.ధోనీకి ఒక్కడికే సాధ్యం. నిజానికి ధోనీ క్రీజులో ఉన్నంత సేపూ గెలుపు భారత్ వైపే మొగ్గు చూపింది. కానీ, దురదృష్టం.. వెంట్రుకవాసిలో అవకాశాన్ని రనౌట్ చేసిపారేసింది. ధోనీ చేసినవి 50 పరుగులుగా బోర్డు మీద కనిపించవచ్చు. అయితే, అవి టీమిండియా ఉన్న పరిస్థితికి 200 పరుగులతో సమానం అనేది నిస్సందేహం. సాధారణంగా ధోనీ రనౌట్ కావడం జరగదు. చాలా అరుదుగా రనౌట్ అవుతాడు. కానీ, అక్కడి పరిస్థితిలో రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కేవలం మిల్లీమీటర్ల తేడాతో గుప్తిల్ డైరెక్ట్ త్రో కొంప ముంచింది.

విజయానికి రెండు ఓవర్లలో 31 పరుగులు కావాలి. అటువంటి పరిస్థితిలో స్ట్రైక్ పూర్తిగా తానే తీసుకోవాలని ధోనీ భావించిఉంటాడు. అదే సరైన వ్యూహం కూడా. అవతలివైపు ఫేర్గ్యూసన్ బౌలింగ్ కచ్చితంగా స్ట్రైక్ ధోనీ చేతిలో ఉంటే పరుగులు పిండవచ్చు. మొదటి బంతికి తిరుగులేని సిక్సర్ కొట్టాడు ధోనీ.. బౌలర్ కి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. రెండో బంతికి పరుగు తీసే అవకాశం దొరకలేదు. మూడో బంతి స్లో బాల్. దాన్ని స్క్వేర్ లెగ్ వైపు తోసాడు. వేగంగా ఒక పరుగు తీసాడు. అక్కడే ఆగిపోతే..స్ట్రైక్ పోతుంది. కచ్చితంగా రన్ తీయాలనుకున్నాడు. అనుకున్నదే చేశాడు. కానీ, షార్ట్‌ ఫైన్‌ లెగ్‌ నుంచి వెళ్లి బంతిని అందుకున్న గప్తిల్‌ స్టంప్స్‌కు నేరుగా త్రో వేశాడు. రీప్లే చూస్తే కొన్ని మిల్లీ మీటర్ల తేడాలో క్రీజుకు ధోని దూరమైనట్లు తేలింది. దీంతో ప్రపంచం మొత్తం ఉసూరుమని పోయింది. ఆటల్లో గెలుపోటములు సహజం. కానీ ఓటమి ఎదురుగా ఉన్నా గెలుపు కోసం చేసిన పోరాటమే ఆటగాళ్ల నైపుణ్యానికి కొలమానం. ఇపుడు రనౌట్ చేసిన గుప్తిల్ ఒక్క బంతితో హీరో ఎలా అయిపోయాడో..అదే బంతికి అవుటైన ధోనీ కూడా క్రికెట్ అభిమానుల హృదయాల్లో తనకున్న ఇమేజిని మరింత పెంచుకున్నాడనడంలో సందేహం లేదు. చప్పగా సాగిన.. అంచనాలకు అనుగుణంగా ముందుకు కదిలిన ప్రపంచ కప్ టోర్నీకి ఈ రనౌట్ ఒక సంచలనం. ఈ మ్యాచ్ ధోనీకి దాదాపుగా చివరి మ్యాచ్ అని చెబుతున్నారు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ధోనీ సిద్ధం అయినట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ రనౌట్ మరో విశేషంగా మారుతుంది. తన కెరీర్ మొదటి మ్యాచ్ లో ధోనీ రనౌట్.. ఇపుడు చివరి మ్యాచ్ (?) లోనూ రనౌట్!

Next Story


లైవ్ టీవి