logo

చెన్నై కి చెక్ ఫైనల్ కి ముంబై ...

చెన్నై కి చెక్ ఫైనల్ కి ముంబై ...
Highlights

మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో చెన్నై చేతులెత్తేసింది . టోర్నీలో ముచ్చటగా మూడోసారి చెన్నై పై ముంబై గెలిచి ఫైనల్...

మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో చెన్నై చేతులెత్తేసింది . టోర్నీలో ముచ్చటగా మూడోసారి చెన్నై పై ముంబై గెలిచి ఫైనల్ లోకి అడుగు పెట్టింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో చెన్నై పరుగులను కట్టడి చేసిన ముంబై తరువాత పెద్దగా కష్టం కాని లక్ష్యాన్ని సునాయాసంగా చేదించి సగర్వంగా ఫైనల్ మ్యాచ్ కు చేరుకుంది. స్వంత మైదానంలో వరుసగా రెండోసారి ముంబై చేతిలో ఖంగు తిని మరో అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిలో చెన్నై సూపర్ కింగ్స్ పడింది. మూడు సార్లు ఛాంపియన్‌ గా నిలిచిన ముంబయి ఫైనల్‌ చేరడం ఇది ఐదోసారి. ఓడిపోయినా.. ఫైనల్‌ చేరేందుకు చెన్నైకి మరో అవకాశముంది. సన్‌రైజర్స్‌, దిల్లీ మధ్య ఎలిమినేటర్‌ విజేతతో ధోని జట్టు అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

పేలవమైన ఆరంభం..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి ప్రారంభం లోనే చుక్కలు కనిపించాయి. బౌలింగ్ కి అనుకులించిన పిచ్ పై ముంబై బౌలర్లు చెలరేగిపోయారు. ఇటు పరుగులు తీయడానికి చెన్నై బ్యాట్స్ మెన్ అష్టకష్టాలు పడ్డారు. ధోని, అంబటి రాయుడు కొద్దిగా ప్రయత్నించారు కాబట్టి చెన్నై కనీసం ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. సూపర్‌కింగ్స్‌ పవర్‌ప్లే ముగిసే సరికి 32 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. మంచి టర్న్‌ లభించిన పిచ్‌పై కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌, జయంత్‌ యాదవ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశారు. రాహుల్‌ చాహర్‌.. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో డుప్లెసిస్‌ (6)ను ఔట్‌ చేయడం ద్వారా వికెట్ల పతనాన్ని ఆరంభించగా.. ఆ తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నంలో రైనా (5), కృనాల్‌కు వాట్సన్‌ (10) జయంత్‌కు దొరికిపోయారు. ఈ ఇద్దరూ క్యాచ్‌ ఔటయ్యారు. మురళీ విజయ్‌ (26; 26 బంతుల్లో 3×4), రాయుడు వెంటనే వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ పరుగులు తీయడానికి మాత్రం అవకాశం దొరకలేదు. 12 ఓవర్లకు స్కోరు 65 మాత్రమే అంటేనే చెన్నై బ్యాటింగ్ కు ఎంత కష్టపడిందో అర్థం అవుతుంది. 13వ ఓవర్లో విజయ్‌ను రాహుల్‌ చాహర్‌ ఔట్‌ చేశాడు. ధోని రాకతో స్కోరు వేగం పెరిగింది. రాయుడు కూడా కాస్త బ్యాట్‌ ఝుళిపించాడు. జయంత్‌ బౌలింగ్‌లో ధోని, రాయుడు చెరో సిక్స్‌ కొట్టారు. హార్దిక్‌ బౌలింగ్‌లో రాయుడు ఓ బంతిని బౌండరీ దాటించాడు. పరుగుల రాక కాస్త పెరిగినా.. అవసరమైనంత వేగంగానైతే స్కోరు రాలేదు. బుమ్రా బౌలింగ్‌లో రాయుడు ఓ ఫోర్‌ కొట్టగా.. చెన్నై 18 ఓవర్లకు 107/4తో నిలిచింది. ఐతే మలింగ బౌలింగ్‌లో ధోని వరుసగా రెండు భారీ సిక్స్‌లు కొట్టి చెన్నైఅభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. ధోని, రాయుడు జోడీ అభేద్యమైన ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించింది. చివరి ఐదు ఓవర్లలో చెన్నైకి 40 పరుగులు వచ్చాయి.

సూర్యకుమార్‌ సూపర్ ఇన్నింగ్స్..

చిన్నదైన లక్ష్యాన్ని(132) చేరుకోవడానికి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు ఆరంభంలో తడబడింది. నాలుగు ఓవర్లలో 22 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. అనుభవమున్న బౌలర్లతో ఉన్న చెన్నై జట్టు పై చేయి సాదిస్తున్దనిపించిన తరుణంలో సుర్య్కుమార్ యాదవ్ మ్యాచ్ గతిని మార్చేశాడు. ఇషాన్‌ కిషన్‌ (28; 31 బంతుల్లో 1×4, 1×6) అండతో చెలరేగిపోయాడు. చెన్నై బౌలర్లకు తమపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఇవ్వకుండా ఎదురుదాడి చేశాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. హర్భజన్‌ బౌలింగ్‌లో కిషన్‌.. ఓ ఫోర్‌, సిక్స్‌ దంచాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ ధాటిని కొనసాగించగా.. కిషన్‌ స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ అతడికి సహకరించాడు. 14వ ఓవర్లో స్కోరు వంద దాటింది. కానీ అదే ఓవర్లో తాహిర్‌ వరుస బంతుల్లో కిషన్‌, కృనాల్‌ (0)లను ఔట్‌ చేసి మ్యాచ్‌పై కాస్త ఆసక్తి కలిగించాడు. కానీ చాలినన్ని ఓవర్లు ఉండగా.. అప్పటికే లక్ష్యానికి చేరువగా వచ్చిన ముంబయికి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. హార్దిక్‌ పాండ్య (13 నాటౌట్‌)తో కలిసి సూర్యకుమార్‌ అలవోకగా పని పూర్తి చేశాడు.

లైవ్ టీవి

Share it
Top