ఉత్కంఠ పోరులో రోహిత్ సేన విజయం

ఉత్కంఠ పోరులో రోహిత్ సేన విజయం
x
Highlights

ఎందుకు ఆ క్రికెట్ మ్యాచులంటే వెర్రి? అనేవాళ్లకి సమాధానం. క్రికెట్ మ్యాచుల్లో ఏముంది? అనుకునేవాళ్లకి ఇదీ ఉండేదన్న సాక్ష్యం. ఉత్కంఠ.. ఉద్వేగం.....

ఎందుకు ఆ క్రికెట్ మ్యాచులంటే వెర్రి? అనేవాళ్లకి సమాధానం. క్రికెట్ మ్యాచుల్లో ఏముంది? అనుకునేవాళ్లకి ఇదీ ఉండేదన్న సాక్ష్యం. ఉత్కంఠ.. ఉద్వేగం.. మునివేళ్లపై కూచుని ఆస్వాదించేలా చేసిన మ్యాచ్ ఇది. రెండు దిగ్గజ క్రికెట్ జట్లు నువ్వా..నేనా అన్నట్టు తలపడుతుంటే.. గాలి కూడా స్తంభించిపోయిందక్కడ. నిండు కుండలా ఉన్న స్టేడియం బంతి బంతికీ హోరెత్తిపోతుంటే.. అసలు సిసలు క్రికెట్ మజా రుచి తెల్సింది అక్కడ. దేశమంతా టీవీల ముందు కళ్లప్పగించి చూస్తుంటే.. ఏం జరిగిందో తెలిసే లోపు ఒక్క పరుగు తేడాతో ముంబయి విజయం సాధించింది.

12వ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకూ విజయం రెండు జట్లతోనూ బంతాడేసుకుంది. మూడు ఓవర్లలో 40 కి పైగా పరుగులిచ్చిన బౌలర్ నాలుగో ఓవర్లో నాలుగు పరుగులిచ్చి.. చివిరి పరుగు చేయాల్సిన తరుణంలో ప్రత్యర్థి వికెట్ ను దొరికించుకుంటే వచ్చే కిక్కే వేరు. సరిగ్గా ముంబై బౌలర్ మలింగకు అటువంటి కిక్కే దొరికింది. వేసిన 23 బంతులకు ఉసూరు మనిపించి నిరాశలో ఉన్న తరుణంలో చివరి బంతికి హీరోగా నిలబడితే ఎంత సంబరమో తెలిసిన తరుణం అది.

చివరి వరకూ పోరాటం చేసి రెండు జట్లు క్రికెట్ అభిమానులకు పసందైన విందును ఇచ్చాయి. తక్కువ స్కోరు చేసి.. దానిని నిలబెట్టుకోవడానికి ముంబై చేసిన పోరాటం ఐపీఎల్ గొప్పతనాన్ని ఆవిష్కరించింది.

ఐపీఎల్ 12 ఫైనల్ మ్యాచులో ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి టోర్నమెంట్ విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్ జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై తమ ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ప్రతిగా బ్యాటింగ్ కు దిగిన ధోనీ సేన చివరి బంతి వరకూ పోరాడి ఒక్క రన్ తేడాతో మ్యాచును చేజార్చుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై. దీంతో ముంబై కప్ ఎగరేసుకు పోయింది. ఈ టోర్నమెంట్ లో ముంబై తో తలపడిన నాలుగు మ్యాచుల్లోనూ చెన్నై ఓడిపోవడం విశేషం.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయిని తక్కువ స్కోరుకే పరిమితం చేసేలా ధోనీ వ్యూహాలు పన్నాడు. వాటిని చిత్తుచేసేందుకు రోహిత్‌సేన ప్రయత్నించింది. చివరికి 8 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41; 25 బంతుల్లో 3×4, 3×6) అత్యంత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. భారీ సిక్సర్లతో పడ్డాడు. అయితే చివరి ఓవర్‌లో అతడిని పరుగులు చేయకుండా డ్వేన్‌బ్రావో కట్టడి చేశాడు.

ముంబయికి క్వింటన్‌ డికాక్‌ (29), రోహిత్‌ శర్మ (15) చక్కని ఆరంభాన్నిచ్చారు. భారీ సిక్సర్లు బాదేశారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జట్టు స్కోరు 45 వద్ద డికాక్‌ను ఔట్‌చేయడం ద్వారా శార్దూల్‌ ఠాకూర్‌ విడదీశాడు. ఆ వెంటనే రోహిత్‌ను దీపక్‌ చాహర్‌ పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్‌ (23), సూర్యకుమార్‌ (15) నిలిచి స్కోరు పెంచారు. కీలక సమయంలో వీరిద్దరినీ 7 పరుగుల వ్యవధిలో ఇమ్రాన్ తాహిర్‌ ఔట్‌ చేశాడు. చివర్లో కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య (16) పరుగులు చేయడంతో ముంబయి స్కోరు 149కి చేరింది. మొదట ముంబయి ఆట చూసిన ఎవరైనా చెన్నై లక్ష్యం 180కి పైగా ఉంటుందనే అనుకున్నారు.

తరువాత చెన్నై ఛేదన అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి బంతి వరకు పోరాడింది. షేన్‌ వాట్సన్‌ (80) మరోసారి ఫైనల్లో తన ఆటతీరుతో అదరగొట్టాడు. ముంబయిని భయపెట్టాడు. డుప్లెసిస్‌ (26) రాణించాడు. అయితే మహీ (15), రైనా (8) త్వరగా ఔటవ్వడం ముంబయి అవకాశాలను మెరుగుపరిచింది. చేజారిపోయిందుకున్న ప్రతిసారీ జస్ప్రీత్‌ బుమ్రా (2/14) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రాహుల్‌ (1/14) పొదుపుగా బౌలింగ్‌ చేసి చెన్నైపై ఒత్తిడి పెంచాడు.

చెన్నై విజయానికి 18 బంతుల్లో 38 పరుగులు అవసరమైనప్పుడు కృనాల్‌ వేసిన 18వ ఓవర్‌లో 20 పరుగులు రాబట్టారు వాట్సన్‌, బ్రావో. అయితే 19వ ఓవర్‌లో బుమ్రా మళ్లీ మాయ చేసి వికెట్‌ తీసి 9 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. 16వ ఓవర్‌లో మలింగ 20 పరుగులు ఇవ్వడంతో అతడికి రోహిత్‌ బంతి ఇస్తాడో లేదో అనుకున్నారు. చివరికి అతడికే బంతిని అప్పగించాడు. మూడు బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి వాట్సన్‌ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. చివరి బంతికి శార్దూల్‌ను ఎల్బీ చేయడంతో చెన్నై 147/7కు పరిమితం అయింది. విజయం ముంబయిని వరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories