కూనను ఉతికి 'ఆరే'సిన ఇంగ్లాండ్!

కూనను ఉతికి ఆరేసిన ఇంగ్లాండ్!
x
Highlights

బ్యాటింగ్ చేయడం ఇంత సులువా? మరి అందరూ ఎందుకు అలా ఆపసోపాలు పడతారు. పడిన బంతిని లేపి అవతల వేయడమేగా.. కొత్తగా క్రికెట్ చూసినవారికి వరల్డ్ కప్ లో...

బ్యాటింగ్ చేయడం ఇంత సులువా? మరి అందరూ ఎందుకు అలా ఆపసోపాలు పడతారు. పడిన బంతిని లేపి అవతల వేయడమేగా.. కొత్తగా క్రికెట్ చూసినవారికి వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ చూసిన వారికి అనిపించక మానదు. బాదుడు.. ఉతుకుడు.. దంచుడు.. ఇలా ఏ పేరు పెట్టాలో కూడా తెలీని విధంగా ఊచకోత కోశాడు మోర్గాన్. బంతి ఎక్కడ వేస్తే ఎలా కొడతాడో.. కొట్టకుండా ఉంటె బావుణ్ణు అని ఆఫ్ఘాన్ బౌలర్లు బేలగా దిక్కులు చూడాల్సిన స్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఎదో ఒకటో రెండో.. మహా అయితే మూడో నాలుగో సిక్స్ లు కొట్టారంటే బ్యాటింగ్ బాగా చేశారు అనుకోవచ్చు. కనీ ఓ ఇన్నింగ్స్ లో 25 సార్లు బంతి గాల్లో బౌండరీ దాటిందంటే.. పాపం బౌలింగ్ వేసిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

నిదానంగా..

బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు అంత గొప్ప ఆరంభం ఏమీ దొరకలేదు. పది ఓవర్లలో కేవలం 44 పరుగులే చేసింది. విన్స్ (26) పెవిలియన్ చేరాడు. రూట్ రంగంలోకి దిగాడు.. బెయిర్‌స్టో కు జత కలిసాడు. మెల్లగా పరుగులు మొదలెట్టారు. అదీ ఏమంత వేగంగా కాదు. 30 ఓవర్ల వరకూ అంతే.. అప్పుడు స్కోరు 164. బెయిర్‌స్టో ఔటయ్యాడు. చినుకులా మొదలైన ఇన్నింగ్స్ వర్షంలా మారింది అంతే. సరిగ్గా ఇప్పుడు వచ్చాడు మోర్గాన్. మామూలుగా కాదు తుపానులా.. వచ్చింది మొదలు అసలు బౌలర్ల మీద ఏ మాత్రం జాలి చూపించలేదు.. బంతుల్ని ఏమాత్రం గౌరవించలేదు. రూట్ చక్కని సహకారాన్ని అందిస్తుంటే.. పరుగుల సునామీ మొదలైంది. అంతే.. తరువాతి 20 ఓవర్లూ ఆఫ్ఘాన్ బౌలర్లకు పీడకలలా మారిపోయాయి. ఒక్కరు కాదు.. మొదట నైబ్.. తరువాత రషీద్ ఖాన్, అటుతర్వాత నబి అందర్నీ ఆదేసుకుని 36 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఇక ఆ తరువాత అది సునామీ కాదు.. దానికి పేరూ పెట్టలేం.. కేవలం 21 బంతుల్లో తరువాతి 50 పరుగులూ చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ కర్మంలో రషీద్ ఖాన్ కు చుక్కలు కనిపించాయి. ఇలా 47 ఓవర్లో మూడు సిక్స్ లు కొట్టి ఇంక చాలనుకున్నాడో.. అలిసిపోయాడో ఔటయ్యాడు. వెంటనే రూట్ కూడా పెవిలియన్ చేరాడు. హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్న ఆఫ్ఘన్ బౌలర్లకు తరువాత మూడు ఒవర్లూ నరకాన్ని చూపించాయి. బట్లర్, స్టోక్స్‌ చెరో రెండు పరుగులూ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు దిగాడు మొయిన్ ఆలీ.. మళ్లీ మరో మినీ విధ్వంశం కనిపించింది. నాలుగు సిక్స్ లు, ఒక ఫోర్ సహాయంతో 9 బంతుల్లో 31 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 397 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గానిస్థాన్‌ 8 వికెట్లకు 247 పరుగులే చేయగలిగింది. హస్మతుల్లా (76), రెహ్మత్‌ షా (46), అస్ఘర్‌ (44) రాణించినా అఫ్గానిస్థాన్‌ లక్ష్యం చేరుకోవడం కష్టమైంది.

మొత్తమ్మీద 150 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్ సెమీస్ వైపు దూసుకు వెళుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories