అలవోక విజయం

అలవోక విజయం
x
Highlights

పన్నెండు సార్లు నిర్వహించిన ఒక టోర్నీలో పదిసార్లు పాల్గొని.. ఎనిమిది సార్లు ఫైనల్ కు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ఆ చరిత్ర సృష్టించింది చెన్నై...

పన్నెండు సార్లు నిర్వహించిన ఒక టోర్నీలో పదిసార్లు పాల్గొని.. ఎనిమిది సార్లు ఫైనల్ కు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ఆ చరిత్ర సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్. పేరుకు తగ్గట్టే ఢిల్లీ జట్టుపై సూపర్ ఆటతీరును కనబరిచి ఫైనల్స్ కు దూసుకు వచ్చింది. ఏ పోటీ అయినా గెలుపోటములు సహజం. అయితే, గెలుపు కిక్కు కన్నా.. ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలే రాబోయే విజయాలకు ప్రేరణగా నిలుస్తాయి. ధోనీ సారధ్యం లోని చెన్నై జట్టు ఎపుడూ ఫేవరేట్ జట్లలో ఒకటిగానే ఉంటూ వస్తోంది. ఈసారి మాత్రం డాడీస్ ఆర్మీ అనే విమర్శకుల ముద్రతో రంగంలోకి దిగింది. దాదాపుగా జట్టులో అందరూ సీనియర్స్ కావడం.. కొంతమందైతే తమ క్రికెట్ కెరీర్ లో ఒడిదుడుకుల బాటలో ఉండడంతో చెన్నై ఫైనల్ కు చేరుతుందని కచ్చితంగా భావించిన వాళ్ళు చాలా తక్కువ. టోర్నీ ప్రారంభంలో వరుస విజయాలతో చార్ట్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది చెన్నై. అటు తరువాత వరుస ఓటములు ఎదురైనా.. రెండోస్థానం లో నిలిచి ప్లే ఆఫ్ కు చేరుకుంది. లీగ్ లో తానాడిన 14 మ్యాచుల్లో 9 మ్యాచుల్లో విజయం సాధించి 5 మ్యాచుల్లో ఓటమి చెంది 18 పాయింట్లను పోగేసుకుంది. మొదటి స్థానం లో నిలిచిన ముంబయి కూడా 18 పాయింట్లే సాధించినా నెట్ రన్ రేట్ తో మొదటి స్థానానికి చేరుకుంది. ఇక ప్లే ఆఫ్ మ్యాచులో చెన్నై చేతులెతేసిందనే చెప్పాలి. ముంబయిని ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. బేటింగ్ వైఫల్యంతో ఓటమి పాలైంది. అటు ఢిల్లీ జట్టు కూడా 18 పాలయింట్లతోనే మూడో స్థానం లో నిలిచింది. రెండో ప్లేఆఫ్ లో సన్ రైజర్స్ ను ఉత్కంఠ భరిత పోరులో ఓడించి రెండో క్వాలిఫైయర్ మ్యాచుకు చెన్నైతో సై అంది. అచొచ్చిన మైదానం లో చెన్నై టీము విజృంభించింది. దీంతో ఢిల్లీ వెనుతిరగక తప్పలేదు.

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉన్న ఢిల్లీ టీం ను ఎదుర్కోవడానికి చెన్నై లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లను ప్రయోగించింది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్న ఢిల్లీని ఆరంభంలోనే దెబ్బ తీయడం ద్వారా చెన్నై బౌలర్లు మ్యాచుపై పట్టు బిగించారు. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న రిషబ్ పంత్ ను పరుగులు చేయనీయకుండా కట్టడి చేయడంలో వారు విజయవంతం అయ్యారు.దాదాపు చివరివరకు క్రీజులో ఉన్నా పంత్ కు బ్యాటు జులిపించే అవకాశం మాత్రం దక్కనీయలేదు. అంతే కాకుండా మరో విశేషం ఏమిటంటే బౌలింగ్ లో బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడం. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ప్రధాన బౌలర్లు నలుగురు తలో రెండు వికెట్లు పడగొట్టారు. దీనితో ఢిల్లీ జట్టుకు బ్యాటింగ్ లో ఏ మాత్రం అవకాశం చిక్కలేదు. ఇక చిన్నదైన మైదానంలో 148 పరుగుల విజయ లక్ష్యం సూపర్ కింగ్స్ కి చాలా చిన్నది గా మారిపోయింది. ఎక్కడా తడబాటు లేకుండా నిదానంగా బ్యాటింగ్ ప్రారంభించి తరువాత ఉప్పెనలా విరుచుకుపడి చెరో అర్థశతకం సాధించారు చెన్నై ఓపెనర్లు. వారిద్దరిని పెవిలియన్ కు పంపించినా అప్పటికే ఆలస్యం అయిపొయింది. మొత్తమ్మీద ఢిల్లీ పై సాధించిన అలవోక విజయం చెన్నై జట్టుకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక రేపు తన చిరకాల ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్ తో ఆమీ తుమీ తెలుసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధం అయిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories