Top
logo

ఎవరు గెలిచినా చరిత్రే!

ఎవరు గెలిచినా చరిత్రే!
Highlights

వరల్డ్ కప్ తుది పోరు కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. అనూహ్యంగా..న్యూజిలాండ్..కొద్దిపాటి తడబాటుతో ఆతిధ్య...

వరల్డ్ కప్ తుది పోరు కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. అనూహ్యంగా..న్యూజిలాండ్..కొద్దిపాటి తడబాటుతో ఆతిధ్య ఇంగ్లాండ్.. ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లూ ఇప్పటివరకూ ప్రపంచ కప్ గెలుచుకోలేదు. ఈరోజు ఏ జట్టు గెలిచినా.. చరిత్ర సృష్టిస్తుంది.

కివీస్ కు ఆ ఒక్కటే లోపం!

ఎవరి బలం ఎంతైనా మ్యాచ్ ఈరోజు ఎవరు బాగా ఆడితే వారిదే చాన్స్ అన్న విషయం తెలిసిందే. అయితే, ఇటువంటి టోర్నీలో ఒత్తిడిని ఎదుర్కోవడమే ముఖ్యం. ఈ విషయంలో న్యూజిలాండ్ టీం ఇప్పటికే ఒత్తిడిని జయించడంలో తాము దిట్టలమని నిరూపించుకుంది. భారత్ తో జరిగిన సెమిఫైనల్ లో కివీస్ జట్టు తమ చక్కని ఆటతీరుతో.. ఒత్తిడిని జయించి తుడిపోరుకు సిద్ధమైంది. అంతే కాదు ప్రపంచ కప్ లో అత్యుత్తమ కెప్టెన్ న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ అనడంలో కూడా సందేహం లేదు. అసలు నాకౌట్ ఆశలే లేని జట్టును.. కప్ ముంగిట నిలబెట్టిన పూర్తి ఘనత అతనిదే. అతని ఆటతీరూ..నాయకత్వ ప్రతిభ.. ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు అన్నీ విలియంసన్ ను ఉత్తమ కెప్టెన్ గా నిలబెట్టాయి. తమ ఓపెనర్లు దాదాపుగా అన్ని మ్యాచుల్లో విఫలం అయినా, జట్టు బ్యాటింగ్ భారాన్ని మొత్తం తానే మోసాడు. మిడిల్ ఆర్డర్ లో టేలర్, నీషంలు తోడుగా అద్భుతాలు చేశాడు. వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన 9 మ్యాచుల్లో 91.33 సగటుతో 548 పరుగులు చేశాడు. అంతేకాదు కీలక సమయంలో బౌలర్ గా అవతారమెత్తి రెండు వికెట్లు కూడా సాధించాడు. తనదైన శైలిలో విలియంసన్ పోరాడితే కప్ గెలిచే ఛాన్స్ న్యూజిలాండ్ దే. అదేవిధంగా, బౌలింగ్ లో ట్రెంట్‌ బౌల్ట్‌ విధ్వంసకర బంతులతో ప్రత్యర్థులను చిత్తూ చేస్తున్నాడు. అసలు కివీస్ సగం బలం ట్రెంట్‌ బౌల్ట్‌ అనడంలో కూడా సందేహం లేదు. వెస్టిండీస్‌(4/30), ఆస్ట్రేలియా(4/51) లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఇక అతనికి తోడుగా ఫెర్గూసన్, హెన్రీ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. వీరు ముగ్గురూ కలిసికట్టుగా రానిస్తే ఎలాఉంటుందో చెప్పడానికి ఉదాహరణ భారత్ తో జరిగిన సెమీఫైనల్. హేమా హేమీల్లాంటి భారత బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించి.. పెవిలియన్ చేర్చిన విషయాన్ని ఇప్పటికీ భారత అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఇంగ్లాండ్ మీద వీరిదే ప్రదర్శన చేస్తే వార్ వన్సైడ్ అయిపోతుంది. ఇక ఆల్రౌండర్ నీషంని తక్కువగా అంచనా వేయలేం. పాకిస్థాన్ మ్యాచ్ లో అతని ప్రదర్శన అందరికీ గుర్తున్దేవుంటుంది. ఒకే ఒక లోపం ప్రస్తుతం న్యూజిలాండ్ ని వెంటాడుతోంది. ఈ టోర్నీ మొత్తంలో ఓపెనర్ల పూర్తి వైఫల్యం ఆ జట్టుకు శాపంగా ఉంది. కీలకమైన ఈ మ్యాచ్ లో గనుక ఈ లోపాన్ని అధిగమిస్తే, కివీస్ కు తిరుగుండదు. మొత్తమ్మీద అన్ని విధాలుగా చూస్తె కివీస్ కే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే, ప్రపంచ కప్ ముందే పాకిస్థాన్ తో సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేసింది ఇంగ్లాండ్. ఆతిథ్య జట్టుగా ఆ జట్టుకు ఈ ప్రదర్శన ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా, క్రికెట్ పండితులందరూ ఆ జట్టును టైటిల్ ఫేవరేట్ గా అంచనా వేశారు. జట్టులో అందరూ ఫాం లో ఉండడంతో కచ్చితంగా కప్ గెలిచే జట్టుగా లెక్కలు వేశారు. ఓపెనర్స్ బెయిర్‌స్టో, జేసన్‌ రాయ్‌ ల మెరుపు ప్రారంభాలు జట్టును లీగ్ దశలో తొలి మ్యాచుల్లో సునాయాస విజయాలవైపు నడిపించాయి. సరిగ్గా ఆ సమయంలో రాయ్ గాయం కారణంగా రెండు మ్యాచ్ లకు దూరం అయ్యాడు. దీంతో వరుసగా మ్యాచ్ లు ఓడిపోయింది. దాదాపు సెమీస్ అవకాశాలు క్లిష్టం అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఈ దశలో మళ్ళీ రాయ్ వచ్చాకా.. వరుస విజయాలతో సెమీస్ చేరింది. సెమీస్ లోనూ తన అద్భుత ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు రాయ్. ఇదే ప్రదర్శన అతను ఇప్పుడు చేస్తే.. కివీస్ కి ఎటువంటి పరిస్థితిలోనూ కప్ దక్కదంటే అతిశయోక్తి కాదు. ఇక బెయిర్‌స్టో మరో పక్క రాయ్ కి చేదోడుగా ఉండి ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారాడు. మిడిల్ లో రూట్, ఆల్రౌండర్ బెన్‌స్టోక్స్‌ వీరంతా రానిస్తే అవతలి జట్టేడైనా కుదేలవ్వల్సిందే. వారి ప్రదర్శన ఎలా ఉంటుందనేదే ఈరోజు కీలకం కానుంది. బౌలింగ్ లో ఆర్చర్ ఆదరగోడుతున్నాడు. 10 మ్యాచ్‌లాడి 19 వికెట్లు పడగొట్టిన ఆర్చర్ ప్రారంభ ఓవర్లలో బ్యాట్స్ మెన్ కు ఊపిరి సలపనీడు. మొత్తమ్మీద ఇంగ్లాండ్ జట్టు బలంగానే ఉంది. ఇంకో బలం స్వంతగడ్డపై ఆడుతున్డటం. తనకు తగ్గట్టుగా రాణిస్తే కప్ గెలవడం పెద్ద కష్టం కాదు.

నిర్ణయించేవి ఆ మూడే!

ఒకటి టాస్.. లార్డ్స్ లో టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే. కానీ, గత ప్రపంచకప్‌ల చరిత్ర ఒకసారి పరిశీలిస్తే.. గత నాలుగు ఫైనల్స్‌లో మూడుసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజతగా నిలిచింది. అంతే కాదు టాస్‌ గెలిచిన ప్రతి జట్టూ ఫైనల్స్‌లో ఓటమిపాలవ్వడం. ఇది కూడా క్లిష్టంగానే ఉంది కదూ.

రెండు ఓపెనర్లు.. రెండు జట్ల మధ్య తేడా ఒపెనర్లె! కివీస్ ఓపెనర్లు వరుస వైఫల్యాలతో ఉన్నారు.. ఇంగ్లాండ్ ఓపెనర్లు పూర్తీ ఫాం లో ఉన్నారు. ఫైనల్ లో చేదన చేయాలంటే ఓపెనర్ల పాత్రే కీలకంగా మారుతుంది. అందువల్ల ఓపెనర్లు ఎలా ఆడతారన్న దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది.

మూడోది ఒత్తిడి.. మామూలుగానే ఏ పోటీ అయినా ఒత్తిడి సహజం. కానీ వరల్డ్ కప్ ఒత్తిడి వేరేగా ఉంటుంది. తమ దేశాల ఆశల్ని మోస్తున్న భారం ప్రతి ఆటగాదిమీదా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్తితులల్లో మొదటే చెప్పినట్టు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కున్న జట్టే ప్రపంచ కప్ ను గర్వంగా ముద్దాడగలదు.

ఏది ఏమైనా ఈ సారి కప్ ఎవరు గెలిచినా చరిత్ర సృష్టిస్తారు అది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
లైవ్ టీవి


Share it
Top