మైదానంలో ప్రత్యర్థిగా తలపడినా.. మ్యాచ్ తర్వాత క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు విరాట్ కోహ్లీ. తనను డకౌట్ చేసిన మ్యాట్ హెన్రీకి ప్రత్యేక బహుమతి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
హెన్రీ చారిత్రాత్మక ప్రదర్శన
నాలుగో వన్డేలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ నిప్పులు చెరిగాడు. 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటింగ్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచాడు.
తొలి ఓవర్లోనే ముగ్గురు ఔట్!
334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ గోల్డెన్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లీ నాలుగు బంతులాడి సున్నా పరుగులకే వెనుదిరిగాడు.
89 పరుగులకే టీమిండియా ఆలౌట్
హెన్రీ దెబ్బకు కోలుకోలేకపోయిన భారత జట్టు చివరకు 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ 244 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్ బయట కోహ్లీ, హెన్రీ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. హెన్రీ బౌలింగ్‌ను ప్రశంసిస్తూ కోహ్లీ అభినందనలు తెలిపాడు. ఈ వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో పంచుకుంది.
భారత్‌పై హెన్రీకి అద్భుత రికార్డు
భారత్‌తో ఇప్పటివరకు 12 వన్డేలు ఆడిన మ్యాట్ హెన్రీ 27 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ సగటు 17.33గా ఉంది. భారత్‌పై రెండుసార్లు ఐదు వికెట్ల ఘనత కూడా సాధించాడు.
2019 ప్రపంచకప్‌లోనూ దెబ్బ
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ భారత జట్టుకు హెన్రీ షాక్ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించి భారత్ ఫైనల్ చేరకుండా అడ్డుకున్న బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.
కోహ్లీకి కూడా హెన్రీ సవాల్
విరాట్ కోహ్లీని కూడా హెన్రీ తరచూ ఇబ్బంది పెడుతున్నాడు. వన్డేల్లో ఏడుసార్లు ఎదురైన సందర్భాల్లో మూడుసార్లు కోహ్లీ వికెట్ తీశాడు. హెన్రీపై కోహ్లీ బ్యాటింగ్ సగటు కేవలం 19 మాత్రమే.
ఐదో వన్డేకు హెన్రీ దూరం
ఆదివారం జరగనున్న ఐదో వన్డేకు న్యూజిలాండ్ జట్టులో మ్యాట్ హెన్రీకి చోటు లేదు. నాలుగో వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. చివరి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి.