కాఫీ పౌడరుకు దోమల్ని తరిమేసే శక్తి ఉందని నిపుణులు చెబుతున్నారు. నిలకడగా ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయని తెలుసు కదా.. అక్కడ కాఫీ పౌడర్ చల్లితే దోమల లార్వాలు చనిపోతాయట!
లావెండర్‌ నూనె వాసనను దోమలు భరించలేవు. అందువల్ల దీనిని దోమల నుంచి రక్షణగా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోనూ, పరిసర ప్రాంతాల్లో లావెండర్‌ నూనెను పిచికారీ చేస్తే దోమలు దరి చేరవు.
హారతి కోసం వాడే కర్పూరం వాసనకు కూడా దోమలు రావని చెబుతున్నారు. ఓ చిన్నప్లేటులో కర్పూరాన్ని తీసుకొని, మూసిఉన్న గదిలో కనీసం 30 నిమిషాలపాటు ఉంచినట్లయితే ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయట.
ఎన్నో ఔషధ గుణాలు పుదీనాలో ఉంటాయి. ఈ ఆకులంటే దోమలు ఆమడ దూరం ఎగిరిపోతాయి. ఇంట్లో ఏదో ఒక మూల పుదీనా ఆకుల్నిగానీ, లేదా పుదీనా ఆయిల్‌ను ఉంచినట్లయితే.. దాని నుంచి వెలువడే పరిమళం వల్ల దోమలు దరి చేరవు.
వెల్లుల్లిలో దోమలను నివారించే చాలా ఔషధగుణాలున్నాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి, వాటిని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ ద్రావణాన్ని ఇంట్లో పిచికారీ చేయాలి. ఇలా చేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. అయితే ఆ ద్రావణం గాఢత కొద్దిసేపట్లోనే పోతుంది కాబట్టి.. మనం ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు.