ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
బతుకమ్మ 9 రోజులూ అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారు.
మొదటి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంగిలిపూల బతుకమ్మలను పేర్చి పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు.
2వ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. అటుకులు, పప్పు, బెల్లం తో నైవేద్యం తయారు చేసే అమ్మవారికి నివేదిస్తారు.
మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీ దేవికి సమర్పిస్తారు.
నాలుగవ రోజు నానుబియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలు కలిపి నైవేద్యం తయారుచేసి అమ్మవారికి నివేదించి వేడుక చేసుకుంటారు.
ఐదవ రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోసెలను పెట్టి పూజిస్తారు.
ఆరవ రోజు బతుకమ్మను జరుపుకోరు. ఆరోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు.
మళ్లీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్లలా బియ్యంపిండిని చుట్టి, వాటిని బాగా వేయించి, వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.
8 వ రోజు వెన్నముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేసి అమ్మవారికి నివేదిస్తారు.
తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు.
ఆశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి నాడు ఐదు రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు.
సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.
ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రక రకాల తృణధాన్యాలను వినియోగిస్తారు.