రూ.10 లక్షల నగదు జమపై నిబంధన

ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాల్లో మొత్తం రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమైతే బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు పంపించాలి.
ఇది నగదు జమపై నిషేధం కాదు
ఖాతాలో రూ.10 లక్షలకు మించి నగదు వేయకూడదని ఈ నిబంధన అర్థం కాదు. అంతకంటే ఎక్కువ జమ చేసుకోవచ్చు. అయితే ఆ లావాదేవీల వివరాలను బ్యాంకులు నివేదించాల్సి ఉంటుంది.
అన్ని పొదుపు ఖాతాల లెక్క ఒక్కటే
ఒకే బ్యాంకు ఖాతాలో చేసిన నగదు జమలనే కాకుండా, ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని పొదుపు ఖాతాల్లోని డిపాజిట్లను కలిపి లెక్కిస్తారు.
వేర్వేరు ఖాతాల్లో జమ చేసినా వర్తింపు
మూడు ఖాతాల్లో రూ.4 లక్షలు, రూ.3.5 లక్షలు, రూ.3 లక్షలు చొప్పున జమ చేసినా మొత్తం రూ.10.5 లక్షలు అవుతుంది. దీంతో ఈ లావాదేవీలు ఐటీ శాఖకు నివేదించాల్సి వస్తుంది.
ఒకే ఖాతాలో విడతలుగా వేసినా..
ఒకే ఖాతాలో ఒకేసారి కాకుండా వేర్వేరు రోజుల్లో నగదు జమ చేసినా మొత్తం లెక్కలోకి వస్తుంది. ఉదాహరణకు రూ.3 లక్షలు, రూ.4 లక్షలు, రూ.5 లక్షలు కలిపి రూ.12 లక్షలైతే నివేదికలోకి వస్తాయి.
బ్యాంకుల బాధ్యత ఏమిటి?
నిర్దేశించిన పరిమితిని చేరుకున్న నగదు లావాదేవీల వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలి. తద్వారా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలపై పన్ను శాఖకు సమాచారం అందుతుంది.
రూ.10 లక్షలు దాటితే పన్ను పడుతుందా?
ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేసినంత మాత్రాన ఆ మొత్తంపై ఆటోమేటిక్‌గా పన్ను విధించరు. నగదు జమ చేయడం, దానిపై పన్ను విధించడం రెండూ వేర్వేరు అంశాలు.
నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేదే కీలకం
పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసినప్పుడు దాని మూలాలను వివరించగలగాలి. ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నిస్తే ఆ నగదు ఎలా సమకూరిందో తగిన ఆధారాలతో వెల్లడించాల్సి రావచ్చు.
లావాదేవీలకు ఆధారాలు ఉండాలి
వ్యాపార ఆదాయం, ఆస్తుల విక్రయం, గతంలో తీసుకున్న నగదు ఉపసంహరణలు వంటి లావాదేవీలకు సంబంధించిన రికార్డులను భద్రపరచుకోవాలి. అవసరమైనప్పుడు ఇవి నగదు మూలాలను వివరించేందుకు ఉపయోగపడతాయి.
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేసేవారు దాని మూలానికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. సరైన వివరాలు, ఆధారాలు అందుబాటులో ఉంటే ఆదాయపు పన్ను శాఖ విచారణ సమయంలో ఇబ్బందులు తగ్గుతాయి.