PPF Withdraw: మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా..?
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) అనేది పన్ను ఆదా చేసుకోగల పెట్టుబడి మార్గాలలో ఒకటి. ఇందులో ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అసలు, వడ్డీ రెండింటిపై పన్ను ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేటు 7.1 శాతం.
ఇందులో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది.
అయితే గడువు తీరక ముందే డబ్బు అత్యవసరం వచ్చినప్పుడు పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వీలుంది.
పీపీఎఫ్‌లో పెట్టుబడులు ప్రారంభించిన తర్వాత ఖాతా మొత్తం మూసివేసేందుకు అవకాశం ఉంది. కానీ, దానికి తగిన కారణాలు అంటే ఉన్నత విద్య, వైద్య చికిత్స లాంటివి చూపాల్సి వస్తుంది.
కానీ గడువు పూర్తికాకముందే ఖాతాను మూసివేస్తే 1 శాతం వడ్డీ తక్కువగా లభిస్తుంది.
అలా వద్దనుకుంటే 15 సంవత్సారాలు పూర్తయ్యాక కూడా ఖాతాను కొనసాగించే అవకాశం కూడా ఉంది.
పీపీఎఫ్ ఖాతాదారుడు ఏడేళ్ల తర్వాత ఏడాదికోసారి పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేసుకునే వీలుంది.
డబ్బు విత్‌డ్రా చేసుకోవాలనుకున్న ఏడాదికి నాలుగేళ్ల ముందు నాటి నగదు నిల్వలో 50 శాతం (లేదా) ఏడాదికి ముందు నగదు నిల్వలో 50 శాతం ఉపసంహరించుకోవచ్చు.
పీపీఎఫ్ ఖాతాపై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది.
ఖాతాపై లభించే వడ్డీ కంటే ఒక శాతం ఎక్కువ వడ్డీ వర్తిస్తుంది. ఖాతా తీసుకున్న మూడో సంవత్సరం నుంచి రుణం తీసుకునే వీలుంది. రుణం తీసుకోవాలనుకుంటున్న సంవత్సరానికి ముందు రెండు సంవత్సరాల ఖాతా నిల్వలో 25 శాతం వరకు రుణంగా పొందచ్చు.
ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 5వ సంవత్సరం వరకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే.. రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది.