వచ్చే 12 నెలలు ఎంతో కీలకం : ఐక్యరాజ్యసమితి

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఒకే ముప్పు ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు ప్రాణాలను కాపాడటం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని గుటెర్రస్‌ అన్ని దేశాలకూ పిలుపునిచ్చారు. రాబోయే 12నెలలు ఎంతో కీలకమైనవని, ఈ సమయంలో కొత్త కేసులను గుర్తించడంతో పాటు నూతన చికిత్సా పద్ధతుల ద్వారా వైరస్‌పై పోరు కొనసాగించేందుకు ప్రపంచదేశాలు కృషిచేయాలని సూచించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును నిర్బంధించిన పోలీసులు
అంతర్వేది రథం దగ్ధం ఘటనకు నిరసనగా ఏపీ బీజేపీ రేపు నిర్వహించతలపెట్టిన ‘చలో అమలాపురం’ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును నిర్బంధించారు. రేపటి కార్యక్రమానికి బయల్దేరుతుండగా అడ్డుకున్నారు. అమలాపురంలో సెక్షన్‌ 30, 144 సెక్షన్‌ అమల్లో ఉందని.. అందుకే నిర్బంధించినట్లు పోలీసులు చెప్పారు.
వారం రోజుల్లో ఆ ప్రణాళిక పంపండి: సుప్రీంకోర్టు
దేశంలోని ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వారం రోజుల్లో పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. జిల్లాల్లో పెండింగ్‌ కేసులు, ప్రత్యేక కోర్టులను పరిగణనలోకి తీసుకోవాలని..ఆ మేరకు ప్రణాళిక రూపొందించాలని సూచించింది.
ఎయిమ్స్‌ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిశ్చార్జి
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం రాత్రి మరోసారి ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం డిశ్చార్జి చేశారు. సోమవారం నుంచి ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కేంద్రమంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఈ బిల్లులను నిరసిస్తూ కేంద్రమంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు. శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై పోలీస్ కేస్
సినీ హీరో అల్లు అర్జున్‌ ఇటీవల కుటుంబ సమేతంగా ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌ కుంటాల సందర్శన వివాదంగా మారింది. కరోనా నిబంధనలు ఉల్లఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని అల్లు అర్జున్‌పై నేరడిగొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.