హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో నిర్మించిన సొరంగ మార్గం అటల్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం ఇదే. దీనికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు.
వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో 2000 జూన్ 3న ఈ సొరంగ మార్గం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత అంటే 2002 మే 26 తేదీన ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
గతంలో దీన్ని రోహ్తంగ్ టన్నెల్ అని పిలిచేవారు. 2019 డిసెంబరు 24 తేదీన అటల్ టన్నెల్‌గా అని పేరు మార్చారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఈ సొరంగ మార్గం నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది.
దీని పొడవు 9.02 కిలోమీటర్లు. హిమాలయాల్లోని పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో అత్యాధునిక ప్రమాణాలతో దీన్ని నిర్మించారు. దీనివల్ల మనాలీ-లేహ్‌ల మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 4-5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ సొరంగం మార్గం వెడల్పు 10.5 మీటర్లు. ఇందులో 8 మీటర్ల వెడల్పులో రోడ్డు నిర్మించారు. అంటే సింగిల్ ట్యూబ్‌లో రెండు లైన్ల రోడ్లను నిర్మించారు. 5.525 మీటర్ల ఓవర్ హెడ్ క్లియరెన్స్ సౌకర్యం ఉంది.
ఇందులో వాహనాలు గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. రోజుకి 3,000 కార్లు, 1,500 ట్రక్కులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది.
ప్రతి 25 మీటర్లకు సొరంగ మార్గం నుంచి బయటికి వెళ్లేందుకు దారి చూపే సూచీలు, లైటింగ్ వ్యవస్థను అమర్చారు. టన్నెల్లో వెలుతురు కోసం సెమీ ట్రాన్స్ఫర్ వెంటిలేషన్ సిస్టం ఉంది.
ప్రతి 150 మీటర్లకు ఎమర్జెన్సీ టెలిఫోన్ సౌకర్యం ఉంది. అలానే ప్రతి 60 మీటర్లకు మంటలను అదుపుచేసే అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థ, 250 మీటర్లకు ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టంతో సీసీటీవీ కెమెరాలు, కిలోమీటరుకు గాలి నాణ్యతను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి.