హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు.
చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు.
2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.
ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉండడం విశేషం.
2016లో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు.
వరల్డ్ అండర్ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
2018లో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.
ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణం గెలిచి తన కలను నెరవేర్చుకున్నాడు. ఇక టోక్యో సాక్షిగా నీరజ్ గ్రాండ్ విక్టరీపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
గోల్డ్ సాధించడంతో నీరజ్ సొంత రాష్ట్రం హర్యానా ఆరు కోట్ల నజరానా ప్రకటించగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి సహా అందరు నీరజ్‌పై అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు.