Pregnancy : 35 ఏళ్ల తర్వాత గర్భధారణ సురక్షితమేనా? ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన విషయాలివే
గర్భధారణ అవకాశాలు తగ్గడం:
వయస్సు పెరిగే కొద్దీ మహిళల్లో అండాల నాణ్యత, సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అందువల్ల 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.
అధిక రక్తపోటు ముప్పు:
ఈ వయసులో గర్భం దాల్చినప్పుడు గర్భధారణ సమయంలో వచ్చే అధిక రక్తపోటు (ప్రీ-ఎక్లాంప్సియా) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గర్భధారణ మధుమేహం :
35 దాటిన గర్భిణులలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం (గెస్టేషనల్ డయాబెటిస్) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బిడ్డ బరువు ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది.
గర్భస్రావం ప్రమాదం :
క్రోమోజోమ్‌ల లోపాలు లేదా ఇతర వయసు సంబంధిత కారణాల వల్ల 35 ఏళ్లు పైబడిన మహిళల్లో గర్భస్రావం జరిగే అవకాశాలు కాస్త పెరుగుతాయి.
నెలలు నిండకుండానే ప్రసవం:
కొన్ని సందర్భాల్లో 35 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యల రీత్యా నెలలు నిండక ముందే (ప్రీమెచ్యూర్) కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి.
పుట్టుకతో వచ్చే లోపాలు:
ఈ వయసులో గర్భం దాల్చడం వల్ల పుట్టబోయే శిశువులో డౌన్ సిండ్రోమ్ వంటి కొన్ని జన్యుపరమైన లేదా పుట్టుకతో వచ్చే లోపాలు తలెత్తే ముప్పు ఉంటుంది.
ముందస్తు ఆరోగ్య పరీక్షలు:
గర్భధారణకు ప్లాన్ చేసుకునే ముందే థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు వంటి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉత్తమం.
ఫోలిక్ యాసిడ్ ప్రాధాన్యత:
ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే ముందు నుంచే వైద్యుల సలహాతో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఇది శిశువు మెదడు, వెన్నుపాము లోపాలను నివారిస్తుంది.
సమతుల్య జీవనశైలి:
సురక్షితమైన గర్భధారణ కోసం సమతుల్య పోషకాహారం తీసుకోవాలి. బరువు అదుపులో ఉంచుకుంటూ, రోజూ తేలికపాటి వ్యాయామాలు, తగినంత నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
వైద్యుల క్రమం తప్పని పర్యవేక్షణ:
ఈ వయసులో గర్భధారణ సాధ్యం కానదేమీ కాదు. అయితే ముందస్తు ప్రణాళిక, క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ అవసరమైన స్కానింగ్‌లు చేయించుకుంటే తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు.