కోల్‌కతా, పశ్చిమ బెంగాల్

దుర్గా పూజకు కోల్‌కతా పెట్టింది పేరు. నగరమంతా అందమైన మండపాలు, భారీ దుర్గామాత విగ్రహాలు, ప్రత్యేక అలంకరణలతో కళకళలాడుతుంది. శోభాబజార్ రాజ్‌బారి, రాణి రష్మోని దుర్గా పూజ, హరినాథ్ ముఖర్జీ కుటుంబ పూజ వంటి సంప్రదాయ వేడుకలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
అహ్మదాబాద్, గుజరాత్
నవరాత్రులు వచ్చాయంటే అహ్మదాబాద్‌లో గర్భా, దాండియా సందడి మొదలవుతుంది. సంప్రదాయ దుస్తులు ధరించి రాత్రంతా చేసే నృత్యాలు పండుగకు ప్రత్యేక కళను తీసుకొస్తాయి. జీఎండీసీ గ్రౌండ్, రాజ్‌పథ్ క్లబ్ వంటి ప్రాంతాల్లో వేడుకలను ఆస్వాదించవచ్చు.
ముంబై, మహారాష్ట్ర
వినాయక చవితితో పాటు దుర్గా పూజకూ ముంబైలో మంచి ఆదరణ ఉంది. బెంగాలీ సాంస్కృతిక సంఘాలు ఏర్పాటు చేసే మండపాలు, అమ్మవారి విగ్రహాలు, ప్రత్యేక ప్రసాదాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. పండుగ సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేస్తాయి.
వారణాసి, ఉత్తరప్రదేశ్
కాశీ ఆధ్యాత్మిక వాతావరణంలో దసరా వేడుకలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. రామలీల ప్రదర్శనలు, జాతరలు, చివరిరోజు రావణ దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తాయి.
ఢిల్లీ
దేశ రాజధానిలో దసరా వేడుకలు రామలీలతో కళకళలాడతాయి. రామ్‌లీలా మైదాన్‌తో పాటు చిత్తరంజన్ పార్క్ (సీఆర్ పార్క్), గ్రేటర్ కైలాష్ ప్రాంతాల్లో దుర్గా పూజ మండపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
గువాహటి, అస్సాం
గువాహటిలో దుర్గాపూజ సందర్భంగా భారీ మండపాలు, అమ్మవారి విగ్రహాలు, జాతరలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. లతాసిల్ ప్రాంతంలోని దుర్గాపూజ వేడుకలు స్థానిక సంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తాయి.
కులు, హిమాచల్ ప్రదేశ్
కులులో దసరా వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రఘునాథ్‌జీకి సంబంధించిన ఆచారాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే దేవతామూర్తుల ఊరేగింపులు ఇక్కడి ఉత్సవాలకు ప్రత్యేకతను తీసుకొస్తాయి. ధాల్‌పూర్ మైదానం వేడుకలకు ప్రధాన కేంద్రం.
పుణె, మహారాష్ట్ర
పుణెలో దుర్గాపూజను సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహిస్తారు. మండపాల అలంకరణలు, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని నింపుతాయి. కాంగ్రెస్ భవన్ దుర్గా పూజ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటి.
దక్షిణ భారతదేశం
దక్షిణాదిలో నవరాత్రులు సరస్వతీ పూజ, విద్యారంభం, బొమ్మల కొలువుతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. పుస్తకాలు, సంగీత వాయిద్యాలు, రోజువారీ పనిముట్లను అమ్మవారి ముందు ఉంచి పూజించడం ఆనవాయితీ. మెట్లపై అమర్చే బొమ్మల కొలువులు ఇళ్లకు పండుగ శోభను తీసుకొస్తాయి.
హైదరాబాద్, తెలంగాణ
హైదరాబాద్‌లో దుర్గాపూజకు బెంగాలీ సంఘాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. ఉత్సవ్ కల్చరల్ అసోసియేషన్, నబరుణ్ సంఘం, బాలానగర్, అత్తాపూర్ బెంగాలీ అసోసియేషన్, ఐకోటాన్ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహార మేళాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.