370 ఆర్టికల్ రద్దుతో ఏం జరగనుంది?

370 ఆర్టికల్ రద్దుతో ఏం జరగనుంది?
x
Highlights

370 ఆర్టికల్ రద్దుతో ఏం జరగనుంది? జమ్ము-కాశ్మీర్ లో ఏయే మార్పులు చోటు చేసుకోనున్నాయి? తాజా మార్పులతో జరిగే పరిణామాలేంటి? ఓ సారి చూద్దాం. దశాబ్దాలుగా...

370 ఆర్టికల్ రద్దుతో ఏం జరగనుంది? జమ్ము-కాశ్మీర్ లో ఏయే మార్పులు చోటు చేసుకోనున్నాయి? తాజా మార్పులతో జరిగే పరిణామాలేంటి? ఓ సారి చూద్దాం. దశాబ్దాలుగా నలుగుతున్న జమ్ము-కాశ్మీర్ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. దీనిపై సెంట్రల్ గవర్న మెంట్ ఓ ముందడుగు వేసింది. 370 ఆర్టికల్ ని రద్దు చేస్తూ, జమ్ము-కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కూడా నిర్మూలించింది. జమ్ము-కాశ్మీర్ ని రెండు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లఢక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించనున్నాయి. పరిపాలనా పరమైన మార్పులు కూడా చోటు చేసుకోనున్నాయి.

ఇక నుండి ఢిల్లీ, పుదుచ్ఛేరి తదితర కేంద్రపాలిత ప్రాంతాల మాదిరిగానే ఇక నుంచి జమ్ము-కాశ్మీర్, లఢక్ ల మీద కేంద్రానికి విశేష అధికారాలు ఉండనున్నాయి. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్‌ గవర్నర్ల ఆధీనంలోకి వస్తాయి. కేంద్ర హోంశాఖ నియంత్రణలో విధులు నిర్వర్తించే లెఫ్టినెంట్ గవర్నర్ కి స్థానిక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అంతిమ పాలనాధికారం ఉంటుంది. జమ్ము కాశ్మీర్‌కు అసెంబ్లీ ఉన్నప్పటికీ.. దిల్లీ ప్రభుత్వం మాదిరిగానే పోలీసు యంత్రాంగం, భూముల నిర్వహణపై ఎలాంటి అధికారాలు ఉండవు. జమ్ము కాశ్మీర్‌కు సంబంధించి ప్రతి అంశంలో కేంద్ర హోంశాఖకు విశేష అధికారులు ఉంటాయి. పార్లమెంట్‌లో చేసే ప్రతి చట్టం ఇక మీదట జమ్ము కాశ్మీర్‌లోనూ అమలు కానుంది.

ఇక ఇప్పటి వరకూ జమ్ము కాశ్మీర్‌లో శాశ్వత నివాసితులకు మాత్రమే అక్కడి భూముల క్రయ విక్రయాలు చేసే హక్కు ఉండేది. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతం ప్రజలైనా జమ్ము కశ్మీర్‌, లఢక్ ప్రాంతాల్లో భూములను కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. ఇక లఢక్ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండవు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రమే అక్కడి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. లఢక్ ప్రాంతానికి జమ్ము కశ్మీర్‌తో సంబంధాలు ఉండవు. ఇక లఢక్ అభివృద్ధిలో నేరుగా కేంద్రం జోక్యం ఉండనుంది. లఢక్ ప్రాంతంలో ఉన్న రెండు జిల్లాలైన లెహ్‌, కార్గిల్‌లు ఇప్పటికే కొంత స్వయం ప్రతిపత్తిని పొందుతున్నాయి. పాక్షికంగా కొండ ప్రాంత అభివృద్ధి మండలి కింద వీటి పాలన కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతూ, మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

జాతీయ జెండాతోపాటు సొంత జెండా కలిగి ఉండటానికి ఆర్టికల్‌ 370 జమ్ము కాశ్మీర్‌కు అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు జమ్ము కాశ్మీర్‌ ప్రత్యేక జాతీయ పతాకం కలిగి ఉండాలంటే.. పార్లమెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు పౌరసత్వాలు, రెండు జాతీయ పతాకాలు, ప్రత్యేక రాష్ట్ర జెండా వంటివి జమ్ము-కాశ్మీర్ లో ఉండే అవకాశం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories