ముంచుకొస్తున్న మరో ముప్పు.. అరేబియా సముద్రంలో నిసర్గ సైక్లోన్‌

ముంచుకొస్తున్న మరో ముప్పు.. అరేబియా సముద్రంలో నిసర్గ సైక్లోన్‌
x
Highlights

బంగాళాఖాతంలో ఉంఫాన్‌ బీభత్సం మరిచిపోకముందే దేశంలో మరో తుఫాన్‌ అటాక్‌ చేసేందుకు సిద్ధమైంది.

బంగాళాఖాతంలో ఉంఫాన్‌ బీభత్సం మరిచిపోకముందే దేశంలో మరో తుఫాన్‌ అటాక్‌ చేసేందుకు సిద్ధమైంది. అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం.. తుఫాన్‌గా మారే ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వాతావరణ శాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రమాదకరంగా మారుతోంది. వాయుగుండంగా మారిన అల్పపీడనం రెండు రోజుల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అదికారులు. నిసర్గ అని పిలవబడుతోన్న ఈ తుఫాన్‌ ఈ నెల 3న దక్షిణ గుజరాత్‌, మహారాష్ట్ర తీరాలను దాటే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

వాయుగుండం తుఫాన్‌గా మారితే గుజరాత్‌, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో గోవా నుంచి గుజరాత్‌ తీర ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. అయితే గుజరాత్‌ కంటే మహారాష‌్ట్ర తీర ప్రాంతాల్లో సైక్లోన్‌ ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఐఎండీ. ముంబై, థానే, పల్గర్‌, రాయ్‌గఢ్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

నిసర్గ ప్రభావంతో జూన్‌ 2న గుజరాత్‌, మహారాష్ట్రలో 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. జూన్‌ 3న గాలుల వేగం 125 కిలోమీటర్లకు పెరుగుతుందన్నారు. జూన్‌ 3,4 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఆ తర్వాత సైక్లోన్‌ బలహీనపడుతుందన్నారు.

సైక్లోన్‌ నిసర్గపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్ష నిర్వహించారు. సైక్లోన్‌ ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన అప్రమత్త చర్యలపై.. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ అధికారులతో చర్చించారు. అటు గుజరాత్‌ సీఎం విజయ్ రూపాణీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో గుజరాత్‌లో 11, మహారాష్ట్రలో 10 బృందాలను సిద్ధం చేసింది నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌. డామన్‌, డయ్యూల్లో ఒక్కో టీమ్‌ను పంపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories