ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌
x
Highlights

గత కొంతకాలంగా నిఘా నీడన ఉన్న కశ్మీర్‌లో.. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం ఒక్కరోజే మూడు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఎదురుకాల్పుల్లో...

గత కొంతకాలంగా నిఘా నీడన ఉన్న కశ్మీర్‌లో.. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం ఒక్కరోజే మూడు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవడంతో పాటు.. ఓ జవాన్‌ అమరుడయ్యాడు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత.. కశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం ఒక్కరోజే మూడు చోట్ల ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో.. నిఘా నీడన ఉన్న కశ్మీర్‌.. మరోసారి ఉలిక్కిపడింది. ఉదయం శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై గ్రెనేడ్‌ దాడి జరిగింది. ఆర్మీ జవాన్లు లక్ష్యంగా జరిగిన ఈ దాడి నుంచి వారు తృటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత రాంబన్‌ జిల్లా బాటోట్‌లో ఉగ్రవాదులకు, భారత జవాన్లకు పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. ఓ వ్యక్తిని బందీగా చేసుకుని.. జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులున్న ఇంటిని చుట్టుముట్టిన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఆ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇటు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఇద్దరు ఉగ్రవాదులు ఆపడానికి ప్రయత్నించగా.. భారత జవాన్ల దుస్తుల్లో ఉన్న వీరిని చూసి.. అనుమానించిన బస్సు డ్రైవర్.. వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్ళిపోయాడు. సమీపంలోని సైనిక చెక్ పోస్టులో సైనికాధికారులకు సమాచారం అందించాడు. దీంతో జవాన్లు, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదులకోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

అలాగే నియంత్రణ రేఖ సమీపంలోని గురేజ్ సరిహద్దుల్లో.. గందర్బల్‌ లోని నారంగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్లో కొందరు మిలిటెంట్లు గ్రెనేడ్లు విసిరారని, అయితే ఎవరూ గాయపడలేదని సంబంధిత అధికారులు వివరించారు. సరిహద్దుల గుండా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ప్రవేశించవచ్ఛునని వార్తలు వస్తున్న వేళ.. యాంటీ-టెర్రర్ ఆపరేషన్స్ ని ముమ్మరం చేయవలసిందిగా భారత జవాన్లకు ఆదేశాలు అందాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories