సుష్మా స్వరాజ్ జీవితంలో అందమైన లవ్ స్టోరీ

సుష్మా స్వరాజ్ జీవితంలో అందమైన లవ్ స్టోరీ
x
Highlights

దేశంలోని స్త్రీలు పరదాల్లో మగ్గిపోతున్న రోజుల్లోనే ఆమె ప్రేమ వివాహం చేసుకుని సంచలనం సృష్టించారు. సుష్మా, స్వరాజ్‌లు వివాహం చేసుకోవాలని భావించినపుడు...

దేశంలోని స్త్రీలు పరదాల్లో మగ్గిపోతున్న రోజుల్లోనే ఆమె ప్రేమ వివాహం చేసుకుని సంచలనం సృష్టించారు. సుష్మా, స్వరాజ్‌లు వివాహం చేసుకోవాలని భావించినపుడు ఇరు కుటుంబాల వారు అందుకు సమ్మతించలేదు. అయితే సుష్మా ఎంతో తెగువచూపి ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకున్నారు. ఇటీవలే 44వ వైవాహిక వేడుకలు జరుపుకున్నారు. సుష్మా లవ్‌స్టోరీపై స్పెషల్‌ స్టోరీ

తన వాక్చాతుర్యంతో మహామహులనే ఢీకొనగలిగే సుష్మా స్వరాజ్ జీవితంలో ఓ అందమైన లవ్ స్టోరీ ఉంది. తన భర్త స్వరాజ్ కౌశల్‌ను పెళ్లి చేసుకునేందుకు చిన్నమ్మ నాడు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. సుష్మా స్వరాజ్ ప్రేమకథ తన సన్నిహితులకు తప్ప ఎవరికీ తెలియదు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని తన భర్తతో ఎక్కువ సమయం కేటాయించాలనుందని ఓ సందర్భంలో చెప్పినప్పుడు సుష్మా-స్వరాజ్ కౌశల్‌ల క్యూట్‌ లవ్ స్టోరీ బయట ప్రపంచానికి తెలిసింది.

దేశ విదేశాల్లో మంచి పేరును సంపాదించుకున్నారు చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌ జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఉన్నాయి. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు చాలా అడ్డంకులను ఎదుర్కొనాల్సి వచ్చింది. సినిమాను తలదన్నే రీతిలోవీరి ప్రేమావివాహం జరిగింది. కాలేజీ క్యాంపస్‌లో సుష్మా క్యూట్‌ లవ్‌స్టోరీ మొదలైంది. ఇద్దరూ ఢిల్లీలో లా చదివేటప్పుడు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఫ్రెండ్‌గా పరిచయమైన స్వరాజ్ కౌశల్ చివరకు భాగస్వామిగా మారి ఆమెకు తోడుగా నీడగా నిలిచాడు. అయితే ఇద్దరి భావజాలాలు వేరుగా ఉండేవి. సుష్మా స్వరాజ్‌ది ఆర్ఎస్ఎస్ భావజాలం కాగా కౌశల్‌ది సోషలిస్టు భావజాలం. అయినప్పటికీ రెండు వేర్వేరు తీగలు కలిసి ఓ అద్భుతమైన ట్యూన్‌ బయటకు వచ్చినట్లు ఇద్దరి భావజాలాలు వేరైనప్పటికీ వారిమధ్య వికసించిన ప్రేమ ఇద్దరినీ ఒక్కటి చేసింది. వారిద్దరి పరిచయం కాస్త పరిణయంగా మారింది.

అయితే వీరి పెళ్లి అనుకున్నట్లుగా చాలా సాఫీగా జరగలేదు. ఇక అన్ని ప్రేమ వివాహాలకు ఉన్న అడ్డంకులే ఈ ప్రేమ జంటకు కూడా ఎదురయ్యాయి. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. సుష్మా స్వరాజ్ సంప్రదాయ హర్యానా కుటుంబం నుంచి వచ్చారు. అయితే సుష్మా ఎంతో తెగువచూపి, ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితులు తారాస్థాయిలో ఉన్నసమయంలో 1975 జూలై 13న వివాహమాడి సుష్మా కాస్త సుష్మా స్వరాజ్‌గా మారింది. వీరిద్దరికీ ఓ బన్సూరి స్వరాజ్ అనే అమ్మాయి ఉంది. ఆమె కూడా తల్లి తండ్రుల్లా న్యాయవాది వృత్తి చేపట్టారు. సుష్మా స్వరాజ్ చివరి శ్వాసకు కొద్ది రోజుల ముందు ఈ జంట తమ 44వ వైవాహిక వేడుకలు జరుపుకున్నారు.

ఇక సుష్మా స్వరాజ్ తన భర్తతో సమయం గడపాలని క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగానే కౌశల్ స్వరాజ్ ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావంటూ ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ చివరిసారిగా మోడీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రమాణస్వీకార కార్యక్రమంలో కనిపించారు. అదే సుష్మా స్వరాజ్ పబ్లిక్‌లో చివరిసారిగా కనిపించడం. ఆ తర్వాత నిత్యం ట్విటర్‌లో తన అభిప్రాయాలను పంచుకునేవారు. చివరిసారిగా కూడా జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు పాసైనప్పుడు " ఈరోజు కోసమే తన జీవితకాలమంతా ఎదురు చూశాను. ప్రధాని మోడీకి అభినందనలు" అని ట్వీట్ చేసిన కొద్ది గంటలకే సుష్మా స్వరాజ్ కానరాని లోకాలకు వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories